ఎలక్షన్‌పై డిజిటల్ ఐ! | GHMC Electons special | Sakshi
Sakshi News home page

ఎలక్షన్‌పై డిజిటల్ ఐ!

Published Sun, Jan 17 2016 5:04 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

ఎలక్షన్‌పై డిజిటల్ ఐ! - Sakshi

ఎలక్షన్‌పై డిజిటల్ ఐ!

* ‘హైదరాబాద్ కాప్’లో ఎలక్షన్ ఫీచర్స్
* పోలింగ్ బూత్‌లన్నీ డిజిటల్ మ్యాపింగ్
* జియోట్యాగింగ్ ద్వారా అనుసంధానం
* ‘లీవ్ బజ్’ పేరుతో
* అత్యవసర స్పందన బటన్

 సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగం ఏడాదిన్నర కాలంగా అందుబాటులోకి తీసుకువచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రేటర్ ఎన్నికల ఘట్టం ప్రశాంతంగా పూర్తి చేయడానికీ వినియోగించనుంది. దీనికి సంబంధించి అధ్యయనం, అభివృద్ధి బాధ్యతల్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) టీమ్ చేపడుతోంది. ప్రాథమికంగా ‘హైదరాబాద్ కాప్’ యాప్‌లో ఎలక్షన్ ఏర్పాట్లకు ప్రత్యేకమైన మార్పు చేర్పు లు చేస్తూ ప్రయోగాత్మకంగా వినియోగించడం ప్రారంభించారు. రానున్న రోజుల్లో అవసరాలకు తగ్గట్టు యాప్స్‌లో మార్పుచేర్పులకు కసరత్తు జరుగుతోంది.
 
కేంద్రాలన్నీ డిజిటల్ మ్యాపింగ్...
నగరంలో ఉన్న పోలింగ్ కేంద్రాలన్నింటినీ డిజిటల్ మ్యాపింగ్ ద్వారా యాప్‌లో పొందుపరిచారు. దీన్ని ఓపెన్ చేసుకుంటే కేవలం పోలింగ్ కేంద్రంతో పాటు అక్కడ విధుల్లో ఉండే సిబ్బంది ఎంతమంది? ఎక్కడెక్కడ విధులు కేటాయించారు? తదితర అంశాలు ప్రత్యక్షమవుతాయి. వారిని సంప్రదించాలని భావించిన అధికారులు, ఇతర సిబ్బందికి ప్రత్యామ్నాయం అవసరం లేకుండా జాగ్రత్త తీసుకున్నారు. మ్యాప్‌లో కనిపించిన సిబ్బంది గుర్తుపై నొక్కితే చాలు... ప్రత్యేక పాప్‌అప్ రూపంలో అతడి పేరు, హోదా, ఫోన్‌నెంబర్లు ప్రత్యక్షం కానున్నాయి. కనిపించిన నెంబర్‌ను టచ్ చేయడం ద్వారా ఫోన్ చేసి మాట్లాడే విధంగా డిజైన్ చేశారు.
 
జవాబుదారీ తనం కోసం ట్యాగింగ్...
పోలింగ్ కేంద్రాల వద్ద విధులకు కేటాయిస్తున్న సిబ్బందిలో పూర్తి జవాబుదారీతనం ఉండేలా ఈ యాప్ ద్వారా చర్యలు తీసుకున్నారు. ఓ అధికారికి ఎక్కడైనా విధులు కేటాయిస్తే తక్షణం ఆ వివరాలను ఈ యాప్‌లో అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా ఫీడ్ చేస్తారు. సదరు అధికారి ఆ ప్రాంతానికి వెళ్తేనే యాప్‌లోకి ప్రవేశించి, ఫీడ్ బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అనధికారికంగా మరో ప్రాంతంలో ఉండి, ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నించినా ఈ యాప్ అంగీకరించదు. ఫలితంగా విధినిర్వహణ పక్కాగా జరగటంతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో పాటు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లోని అధికారులూ తెలుసుకునే అవకాశం ఉంటుంది.
 
ఎప్పటికప్పుడు రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్...
పోలింగ్ జరిగే సమయంలో కొందరు వ్యక్తులు, రాజకీయ నేతలు పుట్టించే పుకార్లు అధికారులకు కంగారు పుట్టించడంతో పాటు సిబ్బందిని ఉరుకులు, పరుగులు పెట్టిస్తాయి. అలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఈ యాప్‌లో రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ పొందే సౌకర్యం కల్పించారు. ఓ ప్రాంతంలో విధుల్లో ఉన్న సిబ్బంది, అధికారులు నిర్ణీత సమయంలో ఈ యాప్‌లోకి ప్రవేశించి, అక్కడి పరిస్థితుల్ని వివరిస్తూ వివరాలు పొందుపరుస్తుంటారు. పుకార్లు షికారు చేసిన సందర్భంలో ఉన్నతాధికారులు, కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది ఈ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్‌ను పరిగణలోకి తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటారు.
 
అన్నింటిలోనూ వినియోగించేలా...
ఈ యాప్ అన్ని స్థాయిల్లోనూ సిబ్బందికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఉన్నతాధికారులు కంప్యూటర్, ల్యాప్‌టాప్స్‌తో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది వద్ద ఉంటే ట్యాబ్స్, స్మార్ట్‌ఫోన్లలో దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో సాధారణ పోలీసింగ్‌లోనూ ‘హైదరాబాద్ కాప్’లో ఉండే సదుపాయాలు ఉపయుక్తంగా మారనున్నాయని అధికారులు చెప్తున్నారు.
 
అత్యవసరమైతే ‘మీట’చాలు
ఎన్నికలు జరిగే సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో హఠాత్తుగా ఉద్రిక్తతలు, ఘర్షణలు చెలరేగుతుంటాయి. వీటిని ప్రత్యక్షంగా చూస్తున్న, సమాచారం తెలుసుకుని అక్కడకు చేరిన క్షేత్రస్థాయి సిబ్బంది దాన్ని అధికారులు, ఇతర విభాగాలకు పంచుకోవడానికి, అదనపు బలగాలను అక్కడకు రప్పించడానికి అష్టకష్టాలు పడాల్సివచ్చేది. విలువైన సమయాన్ని సమాచార మార్పిడికే కేటాయించడం తప్పనిసరిగా మారేది. ఈసారి అలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యాప్‌లో ‘లీవ్ బజ్’ పేరుతో ప్రత్యేక బటన్ ఏర్పాటు చేశారు. ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతంలోని సిబ్బంది దీన్ని నొక్కితే చాలు.. ఉన్నతాధికారుతో పాటు సమీపంలో ఉన్న ఇతర సిబ్బందికీ ఆ సమాచారం రూట్ మ్యాప్‌తో సహా చేరిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement