హిట్ లిస్ట్ లో బంగారం..?
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల చెలామణీని రద్దుచేసి నల్ల కుబేరుల గుండెల్లో బాంబు పేల్చిన కేంద్రప్రభుత్వం మరో సంచలన ప్రకటనకు రడీ అవుతోంది. ఆపరేషన్ బ్లాక్ మనీలో భాగంగా మరో సంచలనానికి తెర తీయనున్నట్టు తెలుస్తోంది. బంగారం డొమెస్టిక్ హోల్డింగ్స్ పై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉందని సమాచారం. తద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ "బ్లాక్ మనీ" వ్యతిరేకంగా పోరాటాన్ని ముమ్మరం చేయనున్నట్టు సమాచారం. పేరు చెప్పడానికి ఇష్టపడని ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించినట్టు న్యూస్ రైజ్ అనే వార్తా సంస్థ రిపోర్టు చేసింది. లెక్కల్లో చూపని ధనాన్ని అక్రమంగా బంగారం కొనుగోళ్లకు వినియోగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు భావిస్తున్నారు.
అయితే డీమానిటైజేషన్, బంగారం దిగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించనుందనే అంచనాల నేపథ్యంలో ఇటీవల బంగారం కొనుగోళ్లు ఊపందకున్నాయి. గతనెలలో గోల్డ్ ప్రీమియం ధరలు రెండేళ్ల గరిష్టాన్ని నమోదుచేశాయి. భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారు కొనుగోలుదారుగా ఉంది. అయితే వార్షిక డిమాండ్ లో మొత్తం1,000 టన్నుల మేర బంగారం కొనుగోళ్లు సుమారు మూడోవంతు నల్లధనం ద్వారానే జరుగుతున్నట్టు మార్కెట్ వర్గాల అంచనా.
మరోవైపు విదేశీ మార్కెట్లో బంగారం ధరలు వెలవెలబోతున్నాయి. న్యూయార్క్ కామెక్స్‌లో డిసెంబర్ ఫ్యూచర్స్ 1 శాతం(దాదాపు 12 డాలర్లు) క్షీణించి 1178 డాలర్ల దిగువన ట్రేడవుతోంది. ఇక వెండి కూడా ఔన్స్ 0.4 శాతం బలహీనపడి 16.43 డాలర్లకు చేరింది. దేశీ మార్కెట్లలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో (డిసెంబర్ ఫ్యూచర్స్) 10 గ్రాముల ధర రూ. 316 క్షీణించి రూ. 28,430వద్ద, వెండి కేజీ (డిసెంబర్ ఫ్యూచర్స్) రూ. 261 తగ్గి రూ. 40,051 వద్ద కదులుతోంది.
కాగా బంగారంపై ఆంక్షలకు సంబంధించిన పుకార్లు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ తరువాతి టార్గెట్ బంగారమే అనే పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే.