దీర్ఘకాలంలో మెరిసేది బంగారమే!
ముంబై/న్యూయార్క్: పసిడి ప్రస్తుతం భారీ పతనాన్ని చూస్తున్నా... ఇప్పటికీ పుత్తడిపై అంచనాలు మాత్రం తగ్గటం లేదు. ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- హెచ్‌ఎస్‌బీసీ పసిడి విభాగ ప్రధాన విశ్లేషకులు జేమ్స్ స్టీల్... తాజాగా ఈ ఎల్లో మెటల్‌పై పూర్తి సానుకూల అంచనాలను ఆవిష్కరించారు. ప్రపంచ వాణిజ్యం మందగిస్తున్న పరిణామం పసిడి కొనుగోళ్ల అంచనాలను పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ‘‘దీంతో పాటు పెట్టుబడుల బలహీనత, ప్రపంచ ఆర్థిక విధానాల్లో అస్పష్టత, ఒక దేశంలో ఆర్థిక సమస్యల ప్రభావం మరోదేశంపై పడుతుండడం వంటి అంశాలు పసిడి మెరుపులకు కారణం కానున్నాయి.
పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే పసిడిపై పెట్టుబడులు దీర్ఘకాలంలో అత్యుత్తమమైనవిగా మారతాయి’’ అని ఆయన విశ్లేషించారు. ప్రపంచ వాణిజ్య వృద్ధి ఈ ఏడాది 2.8 శాతంగా ఉంటుందని ఈ ఏడాది ఏప్రిల్‌లో అంచనావేసిన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ప్రస్తుతం ఈ అంచనాలను 1.7 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్ధులిరువురి విధానాలూ పసిడి బలోపేతానికి సానుకూలమేననీ జేమ్స్ స్టీల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి మాత్రం పసిడి ఔన్స్‌కు 1,400 డాలర్లు దాటకపోవచ్చని ఆయన విశ్లేషించారు. ఫెడ్ వడ్డీరేట్ల పెంపు భయాలు, డాలర్ బలోపేతం, ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్ తక్కువగా ఉండడం వంటి కారణాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.
వారం ధోరణి ఇదీ...
ఇక శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో వారం వారీగా ఏడు డాలర్లు తగ్గి 1,252 డాలర్లకు పడింది. ఇక దేశీయంగానూ ఇదే ప్రభావం కనబడింది. ముంబై ప్రధాన స్పాట్ బులియన్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.95 దిగి రూ.29,900కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పడి రూ.29.750కి చేరింది. పసిడి దిగువబాట ఇది వరుసగా మూడవవారం. ఇక వెండి కేజీకి ధర రూ.295 ఎగసి రూ.42,680 వద్ద ముగిసింది.
ఔన్స్ 31.1గ్రాములు - ప్రస్తుత ధర 1,252 డాలర్లు...
డాలర్‌కు రూపాయి మారకపు విలువ దాదాపు రూ. 68