మెరుపు తగ్గిన బంగారం..బ్యాంకింగ్‌కు ఇబ్బందే! | Crisil says Gold price fall not much of a worry for NBFCs | Sakshi
Sakshi News home page

మెరుపు తగ్గిన బంగారం..బ్యాంకింగ్‌కు ఇబ్బందే!

Published Tue, Apr 13 2021 9:35 AM | Last Updated on Tue, Apr 13 2021 12:12 PM

 Crisil says Gold price fall not much of a worry for NBFCs - Sakshi

సాక్షి, ముంబై: బంగారం ధర తగ్గడం వల్ల బ్యాంకింగ్‌ యేతర ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) రుణ నాణ్యతపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. బంగారం హామీగా రుణాలు ఎన్‌బీఎఫ్‌సీల ప్రధాన వ్యాపార కార్యకలాపాల్లో ఒకటన్న సంగతి తెలిసిందే. కాగా, బంగారాన్ని తాకట్టుగా ఉంచుకుని గత ఆర్థిక సంవత్సరం (2020–21) భారీగా రుణాలు ఇచ్చిన బ్యాంకుల రుణ నాణ్యతకు కొంత ఇబ్బంది తప్పకపోవచ్చని అంచనావేసింది. ఈ నేపథ్యంలో క్రిసిల్‌ విడుదల చేసిన నివేదిక ముఖ్యాంశాలు చూస్తే...  

♦ గత కొన్ని ఆర్థిక సంవత్సరాలగా బంగారం హామీగా ఎన్‌బీఎఫ్‌సీలు ఇస్తున్న రుణ తీరును పరిశీలిస్తే, పసిడి ధరపై రుణ విలువ (లోన్‌-టూ-వ్యాల్యూ-ఎల్‌టీవీ) 75 శాతం దిగువనే ఉంది. దీనికితోడు క్రమానుగతంగా వడ్డీని సంస్థలు సక్రమంగా వసూలు చేస్తున్నాయి. 
♦ 2020 డిసెంబర్‌ 31వరకూ పరిశీలిస్తే, ఎన్‌బీఎఫ్‌సీల సగటు ఎల్‌టీవీ 63 నుంచి 67 శాతం వరకూ ఉంది. అయితే కేవలం 2020 అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌ త్రైమాసికాన్ని చూస్తే, ఇది 70 శాతంగా ఉంది. 
♦ ఎల్‌టీవీ విషయంలో ఎన్‌బీఎఫ్‌సీలు చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వాటి లోన్‌ బుక్స్‌ను పరిశీలిస్తే, బంగారంపై వడ్డీ ఆదాయాలు స్థిర రీతిన 2 నుంచి 4 శాతంగా ఉంటున్నాయి. 
♦ మరోవైపు గడచిన ఆర్థిక సంవత్సరం ఎన్‌బీఎఫ్‌సీలతో పోల్చితే బంగారం హామీగా బ్యాంకులు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేశాయి. వీటి ఎల్‌టీవీ ఏకంగా 78 నుంచి 82 శాతం వరకూ ఉంది. 
♦ ఫిబ్రవరి 2021 వరకూ గడచిన 11 నెలల్లో బంగారం హామీగా బ్యాంకుల రుణ మంజూరీ దాదాపు 70 శాతం పెరిగి రూ.56,000 కోట్లకు చేరాయి. బ్యాంకులకు 90శాతం వరకూ ఎల్‌టీవీ వెసులుబాటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కల్పించడం ఈ భారీ మంజూరీలకు ఒక కారణం. 2021 మార్చి 31 వరకూ బ్యాంకులకు ఈ వెసులుబాటు లభించింది. 
♦  2020 ఆగస్టు నుంచీ బంగారం ధరల 18 నుంచి 20 శాతం వరకూ పడిపోయాయి. దీనికితోడు బంగారంపై ఇచ్చిన రుణాలకు వడ్డీలు కూడా సరిగా వసూలు కాకపోతే, రుణ నాణ్యతపై కొంతమేర ప్రతికూల ప్రభావం తప్పకపోవచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ అండ్‌ డిప్యూటీ చీఫ్‌ రేటింగ్‌ ఆఫీసర్‌ కృష్ణన్‌ సీతారామన్‌ పేర్కొన్నారు. 
♦ ఆయా అంశాలను పరిశీలిస్తే, బంగారం ధరల్లో అస్థిరతల సమస్య నుంచి బయటపడ్డానికి రెండు కీలక మార్గాలు కనబడుతున్నాయి. పటిష్టమైన ‘ఇబ్బందుల నిర్వహణా వ్యవస్థ ఏర్పాటు’ ఇందులో ఒకటి. సకాలంలో కుదువ పెట్టిన బంగారాన్ని వేలం వేసేలా చర్యలు తీసుకోవడం రెండవ కీలక చర్య.

పసిడి ధరల్లో ఒడిదుడుకులు ఇలా... 
కరోనా తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లను ‘సురక్షిత పెట్టుబడుల సాధనంగా’ పసిడి ఆకర్షించింది. గత సంవత్సరం ఆగస్టులో అంతర్జాతీయ కమోడిటీస్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్‌-న్యూయార్క్‌ మర్కంటైల్‌  ఎక్స్చేంజ్‌‌ (నైమెక్స్‌)లో ఔన్స్‌ (31.1గ్రాము) చరిత్రాత్మక గరిష్ట స్థాయి రూ.2,089 డాలర్లను తాకింది. అయితే అమెరికా ఆర్థిక ఉద్దీపన, తిరిగి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటాయన్న విశ్వాసం బలపడ్డం, ఈక్విటీ మార్కెట్ల బలోపేత ధోరణి, డాలర్‌ ఇండెక్స్‌ (89 నుంచి 92 పైకి అప్‌) బలోపేతం వంటి అంశాల నేపథ్యంలో పసిడి ధర క్రమంగా భారీగా తగ్గింది. ఈ వార్తరాసే సోమవారం (12 ఏప్రిల్‌) రాత్రి 8 గంటల సమయంలో నైమెక్స్‌లో ధర 1,733 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గడచిన నెలరోజుల్లో పసిడికి 1,640 డాలర్ల వద్ద రెండుసార్లు పటిష్ట మద్దతు లభించింది. ఈ స్థాయి కిందకు పడితే పసిడి మరింత పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా పసిడి చరిత్రాత్మక గరిష్టం వద్ద ఉన్నప్పుడు దేశీయంగా ధర 10 గ్రాములు పూర్తి స్వచ్చత ధర రూ.56,000 పలికింది. ప్రస్తుతం కొంచెం అటుఇటుగా రూ.46,500 వద్ద ధర ఉంటోంది. ఈ వార్త రాస్తున్న సమయంలో దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌-మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో ధర రూ.46,578 వద్ద ట్రేడవుతోంది. 

ఎన్‌బీఎఫ్‌సీలు పటిష్టం: ఇండియా రేటింగ్స్‌
ఇదిలాఉండగా, కరోనా సెకండ్‌వేవ్‌ను తట్టుకోగలిగిన సామర్థ్యంలో ఎన్‌బీఎఫ్‌సీలు ఉన్నాయని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. ఇందుకు తగిన పటిష్ట మూలధనం, ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) ఎన్‌బీఎఫ్‌సీలు కలిగి ఉన్నట్లు వివరించింది. సెకండ్‌ వేవ్‌తో వ్యాపార కార్యకాలాపాలకు తిరిగి కఠిన ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషించింది. ఎన్‌బీఎఫ్‌సీలు తమ కస్టమర్లకు చక్కటి సేవలు అందించగలుతున్నట్లు వివరించింది. రిటైల్‌ విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రస్తుతం తాను ఇస్తున్న ‘స్టేబుల్‌ అవుట్‌లుక్‌’ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. అలాగే 2021-22కు హోల్‌సేల్‌ ఎన్‌బీఎఫ్‌సీలకు నెగటివ్‌ అవుట్‌లుక్‌ను కొనసాగుతుందని వివరించింది. సెకండ్‌వేవ్‌ విసిరే కొత్త సవాళ్లు వృద్ధి రికవరీపై ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న విషయాన్ని వేచి చూడాల్సి ఉందని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement