
రూ. 30 వేల దిగువకు బంగారం
అంతర్జాతీయ మార్కెట్ బలహీన ధోరణి నేపథ్యంలో శుక్రవారం ఇక్కడ ప్రధాన బులియన్ మార్కెట్‌లో పసిడి రూ.30 వేల దిగువకు జారింది.
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ బలహీన ధోరణి నేపథ్యంలో శుక్రవారం ఇక్కడ ప్రధాన బులియన్ మార్కెట్‌లో పసిడి రూ.30 వేల దిగువకు జారింది. పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.525 తగ్గి రూ. 29,840కి పడింది. ఇది నెల రోజుల కనిష్ట స్థాయి. ఆభరణాల బంగారం ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ. 29,690గా నమోదైంది. వెండి కేజీ ధర రూ. 2,205 తగ్గి, రూ.50,225కు దిగింది.
ఇక అంతర్జాతీయ మార్కెట్ నెమైక్స్ కమోడిటీ డివిజన్‌లో శుక్రవారం కడపటి సమాచారం అందేసరికి పసిడి ధర 17 డాలర్ల నష్టంతో 1314 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. రూ.315 నష్టంతో రూ.29,732 వద్ద ట్రేడవుతోంది. వెండి కాంట్రాక్ట్ రూ.775 నష్టంతో రూ. 49,720 వద్ద ట్రేడవుతోంది.