
బంగారం, వెండి భారీ పతనం
దేశీయంగా, అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లలో మంగళవారం పసిడి, వెండి ధరలు భారీగా పడిపోయాయి.
న్యూయార్క్/ముంబై: దేశీయంగా, అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లలో మంగళవారం పసిడి, వెండి ధరలు భారీగా పడిపోయాయి. అమెరికా ప్రభుత్వ కార్యకలాపాల నిలిపివేత(షట్‌డౌన్) పరిణామాల నేపథ్యం దీనికి కారణం. న్యూయార్క్ ఎక్స్ఛేంజ్ కమోడిటీ డివిజన్‌లో కడపటి సమాచారం అందేసరికి చురుగ్గా ట్రేడవుతున్న పసిడి కాంట్రాక్ట్ ధర ఔన్స్(31.1గ్రా)కు 43 డాలర్లు పడి (3%కి పైగా) 1,284 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వెండి ఔన్స్ ధర సైతం ఒక డాలర్‌కుపైగా నష్టపోయి(4.5%) 20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో పసిడి 10 గ్రాముల ధర 3% నష్టపోయి (రూ.1000 వరకూ) రూ. 29,490 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీకి రూ. 2 వేల వరకూ నష్టపోయి (4%) రూ.47,200 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం నష్టం ఇదే ధోరణిలో ముగిసి, బుధవారం ట్రేడింగ్ కూడా ఇదే బలహీనధోరణిలో కొనసాగితే... గురువారం ఈ ప్రభావం మన దేశీయ స్పాట్ మార్కెట్లలో కనబడే (రూపాయి విలువ కదలికలకు లోబడి) అవకాశం ఉంది. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం దేశీ బులియన్ స్పాట్ మార్కెట్లకు సెలవు.
పసిడి టారిఫ్ విలువ పెంపు: కేంద్రం బంగారం దిగుమతి టారిఫ్ విలువను పెంచింది. 10 గ్రాములకు 432 డాలర్లుగా ఉన్న ఈ విలువను 436 డాలర్లుకు పెంచుతున్నట్లు తెలిపింది. అయితే వెండి (కేజీ) విషయంలో టారిఫ్‌ను ప్రస్తుత 736 డాలర్ల నుంచి 702 డాలర్లకు (దాదాపు 5%) తగ్గించింది.