బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌కు రూ.11 వేల కోట్లు వాపసు
Published Fri, Sep 13 2013 1:12 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం కంపెనీలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లకు రూ.11,000 కోట్లకుపైగా స్పెక్ట్రం ఫీజును కేంద్రం వాపసు ఇవ్వనుంది. 2010లో దక్కించుకున్న బ్రాండ్‌బ్యాండ్ వైర్‌లెస్ యాక్సెస్(బీడబ్ల్యూఏ) స్పెక్ట్రంను వెనక్కితిరిగిచ్చేయాలని ఈ రెండు కంపెనీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి చిదంబరం నేతృత్వంలోని మంత్రుల బృందం(జీఓఎం) గురువారం ఇందుకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఎంటీఎన్‌ఎల్ సిబ్బందికి పెన్షన్ ప్రతిపాదనకు కూడా ఓకే చెప్పినట్లు జీఓఎం సమావేశం అనంతరం టెలికం మంత్రి కపిల్ సిబల్ వెల్లడించారు. పెన్షన్ కోసం ఏటా రూ.570 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.
జీఓఎం నిర్ణయానికి ఇక కేబినెట్ ఆమోదం లభించాల్సి ఉంటుం దని సిబల్ చెప్పారు. స్పెక్ట్రం డబ్బు వాపసు లభిస్తే ఈ రెండు కంపెనీలు మళ్లీ గాడిలోపడేందుకు దోహదపడుతుందని భావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. బీడబ్ల్యూఏ స్పెక్ట్రం వెనక్కిచ్చేయడం వల్ల బీఎస్‌ఎన్‌ఎల్‌కు రూ.6,725 కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌కు రూ.5,700 కోట్లు ప్రభుత్వం వావసు చేయనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎంటీఎన్‌ఎల్ నికర నష్టం 2012-13లో రూ.5,321 కోట్లకు ఎగసింది. అదేవిధంగా బీఎస్‌ఎన్‌ఎల్ నికర నష్టం కూడా గతేడాది రూ.8,198 కోట్లుగా ఉండొచ్చని అంచనా. కాగా, జీఓఎం ఆమోదముద్ర నేపథ్యంలో ఎంటీఎన్‌ఎల్ షేరు గురువారం బీఎస్‌ఈలో 20% దూసుకెళ్లి రూ.15.35 వద్ద స్థిరపడింది.
Advertisement
Advertisement