సొంత స్మార్ట్ వాచ్ లతో గూగుల్...!
ఇప్పటికే ఆండ్రాయిడ్ వేర్ డివైజ్ లతో మార్కెట్లోకి వచ్చిన గూగుల్.. తన సొంత స్మార్ట్ వాచ్ ల తయారీలో ప్రస్తుతం నిమగ్నమై ఉందట. నెక్షస్ బ్రాండ్ లో సొంత ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్ వాచ్ లను తీసుకొచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. రెండు వివిధ సైజుల్లో ఈ వాచ్ లను తీసుకురానుందట. 43.5 ఎంఎం, 42 ఎంఎం డయామీటర్ సర్ క్యూలర్ డిస్ ప్లేలతో ఈ స్మార్ట్ వాచ్ లు వినియోగదారుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. మూడు బటన్ లను 43.5 ఎంఎం డయామీటర్ డిస్ ప్లే వాచ్ కలిగి ఉంటుందని, ఆ వాచ్ ముదురు బూడిద రంగులో రూపొందిస్తున్నారని తెలుస్తోంది.
మొదటి దానితో పోలిస్తే సైజులో తక్కువున్న రెండో వాచ్, స్వార్డ్ ఫిష్ కోడ్ నేమ్ తో మార్కెట్లోకి తీసుకు రాబోతుందని తెలుస్తోంది. ఇది ఆండ్రాయిడ్ వేర్ వాచ్ ల మాదిరిగా కేవలం ఒక్కటే బటన్ ఉంటుదట. అయితే ఈ వాచ్ మూడు రంగుల్లో మార్కెట్లోకి వస్తుందట. సిల్వర్, టైటానియం, రోజ్ గోల్డ్ రంగుల్లో దీన్ని రూపొందిస్తున్నారని సమాచారం. జీపీఎస్, హార్ట్ రేట్ సెన్సార్, ఎల్ టీఈ ప్రత్యేకతలను పెద్ద సైజు స్మార్ట్ వాచ్ కలిగిఉండగా.. చిన్న సైజు స్మార్ట్ వాచ్ లో ఎల్ టీఈ, జీపీఎస్ సిస్టమ్ లు ఉండవని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
నోటిఫికేషన్లు, యాప్స్, ఇతర కంట్రోల్స్ ను చిన్న స్క్రీన్ లో అభివృద్ధి చేయడంలో ప్రస్తుతం గూగుల్ ప్రయత్నిస్తుందని రిపోర్టులు తెలుపుతున్నాయి. ఎల్ జీ వాచ్, మోటో 360, శామ్ సంగ్ గేర్ లైవ్ బ్రాండ్లతో 2014లో ఆండ్రాయిడ్ వేర్ వాచ్ లను గూగుల్ మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన సొంత స్మార్ట్ వాచ్ హార్డ్ వేర్ తో రెండు కొత్త స్మార్ట్ వాచ్ లను వినియోగదారుల ముందుకు ప్రవేశపెట్టేందుకు గూగుల్ సిద్ధమవుతోందని తెలుస్తోంది.