
మ్యాగీ.. మీరు 640 కోట్లు కక్కండి!
నెస్లె ఇండియా విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అనుచిత వ్యాపారాలు చేశారని, లేబుళ్ల మీద తప్పుడు వివరాలు ఇచ్చారని, తప్పుదోవ ప్రకటించే ప్రకటనలు చేశారని.. వీటన్నింటి దృష్ట్యా దేశానికి జరిగిన నష్టానికి గాను రూ. 640 కోట్లు కట్టాలని కేసు దాఖలు చేసింది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ వద్ద కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ తొలిసారిగా ఓ కంపెనీపై కేసు పెట్టింది.
వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం వచ్చిన దాదాపు మూడు దశాబ్దాల్లో ఓ కంపెనీపై ప్రభుత్వ శాఖ ఇలా కేసు పెట్టడం ఇదే తొలిసారి. మ్యాగీ నూడుల్స్లో సీసంతో పాటు ఎంఎస్జీ (మోనోసోడియం గ్లూటామేట్) ఎక్కువ స్థాయిలో ఉన్నాయంటూ ఆరోపణలు రావడంతో చాలా రాష్ట్రాలు దాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇన్నాళ్లకు ఈ కేసు దాఖలైంది. ఇంతకుముందు తాము నెస్లె కంపెనీపై కేసు పెట్టాలని సూచించామని, ఇప్పుడు తామే కేసు పెట్టామని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ తెలిపారు.