ఇక వీసీలను నియమించేది సర్కారే | Government to select of Voice chancellor | Sakshi
Sakshi News home page

ఇక వీసీలను నియమించేది సర్కారే

Published Sat, Sep 12 2015 2:45 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

ఇక వీసీలను నియమించేది సర్కారే

ఇక వీసీలను నియమించేది సర్కారే

- గవర్నర్ నేతృత్వంలో నియామకాలు రద్దు
- రాష్ట్రంలో కొత్తగా యూనివర్సిటీ చట్టం ఏర్పాటు
- పాత చట్టాలకు సవరణలు చేస్తూ ఉత్తర్వులు

 
 సాక్షి,హైదరాబాద్: యూనివర్సిటీల్లో వైస్ చాన్సలర్లను (వీసీ) నియమించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమ అధీనంలోకి తెచ్చుకుంది. ఇన్నాళ్లు గవర్నర్ నేతృత్వంలో జరిగే ఈ నియామకాల విధానం దీంతో రద్దు అయ్యింది. అంతే కాదు వివిధ రంగాల్లో నిపుణులను ఒక్కో యూనివర్సిటీకి చాన్సలర్‌గా నియమించేలా ఈ చట్టం రూపకల్పన జరిగింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల చట్టం-1991కి రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది.
 
 తెలంగాణ యూనివర్సిటీల చట్టంగా దీనిని పేర్కొంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలకు ఉన్న వేర్వేరు చట్టాల్లోని నిబంధనలను కూడా మార్చింది. ఆయా యూనివర్సిటీలకు ఉన్న పాత చట్టాలను తీసుకుంటూనే మార్పులను చేసింది. వర్సిటీ కొత్త చట్టాల నిబంధనలకు సంబంధించి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయి.
 
 ఇవీ మార్పులు..
 -    ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల చట్టం-1991కు ప్రభుత్వం మార్పులు చేసి తెలంగాణ రాష్ట్రానికి అడాప్ట్ చేసుకుంది. అలాగే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ యాక్ట్-1982, రాజీవ్‌గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్‌జీయూకేటీ) చట్టం-2008, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయ చట్టం-2008, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ యాక్ట్ -2008, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ యాక్ట్-1985 నిబంధనలకు మార్పులు చేసింది. మిగతా యూనివర్సిటీల చట్టాలను కూడా త్వరలో మార్చుతూ ఉత్తర్వులను జారీ చేయనుంది.
 -    ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల చట్టం-1991 సెక్షన్ 10లో ఉన్న ‘రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు గవర్నర్ చాన్సలర్‌గా వ్యవహరిస్తారు’ అన్న నిబంధనను మార్పు చేసింది. దాని స్థానంలో ‘ప్రతి యూనివర్సిటీకి చాన్సలర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.’ అన్న పదాన్ని చేర్చింది.
 -    సెక్షన్ 11 సబ్ సెక్షన్ 1లో వైస్ చాన్సలర్ పోస్టుకు సెర్చ్ కమిటీలు పంపించే ముగ్గురి పేర్లున్న జాబితాలో ఎవరో ఒకరిని గవర్నర్ ఖరారు చేస్తారన్న నిబంధనను కూడా మార్పు చేసింది. తాజా సవరణ ప్రకారం ‘వీసీ పోస్టుకు సెర్చ్ కమిటీ ముగ్గురి పేర్లున్న ప్యానెల్ జాబితాను అందజేయాలి. అందులో ఎవరో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత యూనివర్సిటీకి వీసీగా నియమిస్తుంది.’ అన్న నిబంధనను చేర్చింది.
 -    పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ చట్టం సెక్షన్ 9లో, జేఎన్‌టీయూ చట్టం సెక్షన్ 6లో, జేఎన్‌ఎఫ్‌ఏయూ చట్టం సెక్షన్ 6లో, ఆర్‌జీయూకేటీ చట్టం సెక్షన్ 6లో, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ చట్టం సెక్షన్ 9లో ‘యూనివర్సిటీకి చాన్సలర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది’ అని చేర్చింది.
 -    అలాగే ఆయా యూనివర్సి టీల్లో చట్టాల్లో ‘సెర్చ్ కమిటీలు పంపించే జాబితాలో ఉన్న ముగ్గురిలో ఒకరిని వీసీగా ప్రభుత్వం నియమిస్తుంది’ అని చేర్చింది.
 
 త్వరలో వర్సిటీలకు వీసీలు...
 మూడేళ్లుగా రెగ్యులర్ వైస్ చాన్సలర్లు లేక యూనివర్సిటీల పాలన గందరగోళంగా మారింది. ఆరు నెలలుగా చాన్సలర్లు, వీసీ నియామకాలపై చర్చ జరుగుతున్నా ఉత్తర్వులు జారీ కాలేదు. ఎట్టకేలకు చట్టాలను మార్చుతూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలోనే యూనివర్సిటీలకు చాన్సలర్ల నియామకాల ప్రక్రియ మొదలు కానుంది. అంతేకాదు ఒక్కో యూనివర్సిటీకి వీసీ ఎంపిక కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, జేఎన్‌టీయూ, జేఎన్‌ఎఫ్‌ఏయూ, ఆర్‌జీయూకేటీ, అంబేడ్కర్  ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, పాలమూరు, మహత్మాగాంధీ యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రస్తుతం వాటిల్లో ఎక్కడా రెగ్యులర్ వీసీలు లేరు. తాజా ఉత్తర్వులతో చాన్సలర్లు, వీసీల నియామకాల ప్రక్రియ మొదలు కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement