కోల్ ఇండియాలో 5% వాటా విక్రయానికి రెడీ
Published Fri, Aug 9 2013 1:12 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
న్యూఢిల్లీ: కోల్ ఇండియాలో 5% వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఆఫర్ ఫర్ సేల్‌ను చేపట్టనున్నట్లు డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ తెలిపింది. దీంతో 5% వాటాకు సమానమైన 31.58 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రూ. 8,500 కోట్లవరకూ లభించే అవకాశముంది. కంపెనీలో ప్రస్తుతం ప్రభుత్వానికి 90% వాటా ఉంది. బీఎస్‌ఈలో గురువారం షేరు ధర 2% లాభపడి రూ. 268 వద్ద ముగిసింది. ఇష్యూ నిర్వహణకు ఎంపిక చేసిన మర్చంట్ బ్యాంకర్ల ద్వారా ప్రభుత్వం ఈ నెల 26న బిడ్స్‌ను ఆహ్వానించనుంది.
దీనిలో భాగంగా కంపెనీ ఉద్యోగులకు ఆఫర్ ధరలో 5% డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇష్యూలో 10% షేర్లను ఇందుకు కేటాయించనున్నారు. కాగా, నిజానికి తొలుత 10% వాటాను డిజిన్వెస్ట్ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కు తగ్గింది. మరోవైపు సెప్టెంబర్ 19 నుంచి మూడు రోజుల సమ్మెను చేపట్టనున్నట్లు ట్రేడ్ యూనియన్ నోటీసును జారీ చేసింది. 2010లో తొలిసారి 10% వాటాను విక్రయించడం ద్వారా ప్రభుత్వం కోల్ ఇండియా షేర్లను ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేసింది.
Advertisement
Advertisement