
ప్రభుత్వ విప్ చింతమనేనిపై కేసు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఓ పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఘటనకు సంబంధించి ప్రభుత్వ విప్, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహా 17మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు గురువారం ఏలూరు డీఎస్పీ జి.వెంకటేశ్వరరావు తెలిపారు. స్థల వివాదం నేపథ్యంలో చింతమనేని బుధవారం తన అనుచరులతో దెందులూరులో ఉంటున్న కానిస్టేబుల్ మధు ఇంటికి వెళ్లి ఆయనపై దౌర్జన్యం చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై మధు భార్య దుర్గ ఫిర్యాదు మేరకు గురువారం పోలీసులు చింతమనేని, ఆయన గన్‌మేన్‌తోపాటు మరో 15మందిపై సెక్షన్ 323, 324, 427, 447, రెడ్‌విత్ 34, ఐపీసీ 149 కింద కేసులు నమోదు చేశారు. కాగా, ఇదే వివాదంలో కానిస్టేబుల్ మధు, ఆయన భార్య దుర్గ, కుమారుడు సాయి, మరో మహిళ విమలపై కూడా కేసు నమోదు చేశారు. రోడ్డు నిర్మాణానికి అడ్డు రావడం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో వీరిపై 359, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు దెందులూరు ఎస్సై ఎంవీ సుభాష్ తెలిపారు.