ఎన్డీటీవీ ప్రసారాలు నిలిపివేత
ప్రముఖ జాతీయ చానెల్ ఎన్డీటీవీ ప్రసారాలను ఒక రోజు పాటు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసారాల నియమాలను ఉల్లంఘనే ఇందుకు కారణమని తెలుస్తోంది. పఠాన్ కోఠ్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి సమయంలో ప్రోగ్రాం కోడ్ ను ఉల్లఘించి కీలక ప్రదేశాలను ఎన్డీటీవీ ప్రసారం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసిన కేంద్ర ప్రసారాల శాఖ ఎన్డీటీవీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది.
మంత్రుల కమిటీ చేసిన సూచనల ప్రకారం దాడిని ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల టెర్రరిస్టులపై ప్రభుత్వం తీసుకునే చర్యల వివరాలు ప్రసారమైనట్లు నిర్దారణ జరిగిందని చెప్పారు. ఈ మేరకు ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నవంబర్ 10వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకూ చానెల్ ప్రసారాలను నిలిపివేయాలని ఎన్డీటీవీని కోరినట్లు తెలిపింది.
కాగా, ఎన్డీటీవీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా లేదని వెల్లడించింది. ఎయిర్ బేస్ లోని విమానస్ధావరాలు, యుద్ద విమానాలు, రాకెట్ లాంచర్లు, మోటార్లు, హెలికాప్టర్లు, ప్రెట్రోల్ ట్యాంకులు తదితరాలను ఎన్డీటీవీ ప్రసారం చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత ఎన్డీటీవీకి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు.