ఎన్డీ టీవీకి ఊరట...!
న్యూఢిల్లీ : జాతీయ న్యూస్ ఛానల్ ఎన్డీ టీవీకి తాత్కాలిక ఊరట లభించింది. ఈ నెల 9వ తేదీన ఒకరోజు పాటు ప్రసారాలు నిలిపేయాలన్న నిర్ణయంపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ పునరాలోచిస్తున్నట్లు సమాచారం. ఎన్టీ టీవీపై నిషేధాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రసారాల నిలిపివేత నిర్ణయాన్ని కేంద్రం పునపరిశీలించాలని ఎన్బీఏ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు పఠాన్‌కోట్ దాడిపై ప్రసారాలు చేసినందుకు ‘ఎన్డీటీవీ ఇండియా’ హిందీ న్యూస్ చానల్ ప్రసారాలు ఒకరోజుపాటు నిలిపివేయాలన్న ఆదేశాల్ని విపక్షాలు, మీడియా సంస్థలు ఖండించాయి. సమాచార ప్రసార శాఖకు చెందిన అంతర్ మంత్రిత్వ శాఖ విచారణ బృందం ఆదేశాల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు ఎమర్జెన్సీ రోజులు గుర్తు కొస్తున్నాయంటూ మండిపడ్డాయి.
ప్రసారాల నిలుపుదలపై ఇచ్చిన ఆదేశాల్ని తక్షణం ఉపసంహరించుకోవాలన్నాయి. ఐబీ ఉత్తర్వుల్ని ఖండించడంతో పాటు ఇది పత్రికా స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా. బ్రాడ్‌కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ పేర్కొన్నాయి. కాగా పటాన్ కోట్లో మిలట్రీ ఆపరేషన్ లైవ్ ఇచ్చినందుకు ఎన్డీ టీవీపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఈ చర్యలు తీసుకున్న విషయం విదితమే.