పాఠశాలలో మృతిచెందిన హెచ్ఎం ప్రభావతి(ఫైల్ ఫొటో)
ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ
పూడూరు: స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేస్తూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతి భర్తకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం ఉమ్మెంతాల్ లో ప్రభావతి కుటుం బాన్ని ఆయ న పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రభావతి భర్త రాజీవ్‌రెడ్డికి నెలరోజుల్లోగా ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆమె కూతుళ్లు ఉన్నత చదువులు చదివేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రభావతిలాంటి ఉత్తమ టీచర్ల వల్లే విద్యావ్యవస్థ బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎక్స్‌గ్రేషియాను అందించేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. గాయాలపాలైన విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
స్కూళ్లలో ప్రమాదకర పరిస్థితులను గుర్తించండి: విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల పరిసరాల్లో ప్రమాదకర పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయన్న లెక్కలు తేల్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాలలను ఆనుకొని ప్రమాదాలకు ఆస్కారం ఉన్న బావులు, విద్యుత్ తీగలు వంటి వాటి వివరాలను సేకరించాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల కింద రంగారెడ్డి జిల్లా మేడికొండ ప్రభుత్వ పాఠశాలలో జెండా రాడ్‌కు విద్యుత్ తీగ తగిలి ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో విద్యాశాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది.