ఐటీ పెట్టుబడుల ప్రాంతంగా హైదరాబాద్!
Published Thu, Sep 19 2013 2:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM
న్యూఢిల్లీ: సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం(ఐటీఐఆర్)గా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనపై ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) శుక్రవారం పరిశీలించనున్నట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఐటీఐఆర్‌లో ఉత్పాదక యూనిట్లు, లాజిస్టిక్స్, పబ్లిక్ యుటిలిటీస్, పర్యావరణ పరిరక్షణ, గృహ సముదాయాలు, పాలనా సంబంధ సర్వీసుల వంటివి ఏర్పాటవుతాయి.
వీటిలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు(ఎస్‌ఈజెడ్), పారిశ్రామిక పార్క్‌లు, స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాలు, గిడ్డంగులు(వేర్‌హౌసింగ్), ఎగుమతి యూనిట్లు తదితరాలను కూడా నెలకొల్పే అవకాశముంది. 25 ఏళ్ల కాలంలో 50,000 ఎకరాలలో రెండు దశలలో ఐటీఐఆర్ ఏర్పాటవుతుంది. ఐటీ, ఐటీ ఆధారిత రంగాలలో రూ. 2.19 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశముంది. తద్వారా 15 లక్షల మంది యువకులకు ప్రత్యక్ష ఉపాధి లభించగలదు. దేశ ఐటీ ఎగుమతుల్లో రాష్ర్టం వాటా 12.4%కాగా, 4వ ర్యాంక్‌లో ఉంది. 2011-12లో రాష్ట్రం నుంచి ఐటీ సేవల ద్వారా రూ.53,246 కోట్ల టర్నోవర్ నమోదైంది.
Advertisement