నార్త్ టెక్సాస్‌లో మహాత్మగాంధీ మెమోరియల్ ప్లాజా
డల్లాస్, టెక్సాస్: అమెరికాలోని నార్త్ టెక్సాస్‌లో కొత్తగా ఏర్పాటైన మహాత్మ గాంధీ మెమోరియల్ ప్లాజాను అక్టోబర్ రెండో తేదీన గురువారం నాడు ప్రారంభించారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్ (ఐఏఎఫ్‌సీ), ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఐఏఎన్‌టీ) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ మెమోరియల్ ప్లాజా ఏర్పాటు కార్యక్రమం జరిగింది. మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మహాత్మగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఛైర్మన్, తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ తెలిపారు.ఈ కార్యక్రమానికి మహాత్మ గాంధీ మనవడు సతీష్ ధుపేలియా ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఏడు అడుగుల 30 అంగుళాలు ఉండే ఈ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బుర్రా వర ప్రసాద్ తయారు చేశారు. వెండి పూతతో తయారు చేసిన ఈ విగ్రహం అమెరికాలో ఉన్న గాంధీ విగ్రహాల్లోనే అత్యంత పెద్దది. ఇప్పటివరకూ అమెరికాలో 17 గాంధీ విగ్రహాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 4వ తేదీన మహాత్మా గాంధీ జీవిత ఆశయాలను కొనసాగించేందుకు మహాత్మా గాంధీ పీస్‌వాక్ - 2014ను నిర్వహించినట్లు ప్రసాద్ తోటకూర తెలిపారు.