
ఎర్రకోటలో గ్రెనేడ్!
దేశంలో ఎంతో ప్రతిష్టాత్మక కట్టడమైన ఎర్రకోటలో శుక్రవారం ఉదయం గ్రెనేడ్ కలకలం సృష్టించింది.
న్యూఢిల్లీ :
దేశంలో ఎంతో ప్రతిష్టాత్మక కట్టడమైన ఎర్రకోటలో శుక్రవారం ఉదయం గ్రెనేడ్ కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న భద్రతాధికారులు వెంటనే బాంబ్ స్క్వాడ్‌కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి దాన్ని తొలగించారు. ఎర్రకోటను శుభ్రం చేసే పనివారు ఎర్రకోటలోని సావన్ భడో ఉద్యానవనాన్ని శుభ్రపరుస్తుండగా వారికి అక్కడ గ్రెనేడ్ కనిపించింది. దీంతో వారు వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే అధికారులు బాంబ్ స్క్వాడ్‌కు విషయం తెలిపారు. వారు వచ్చి తనిఖీ నిర్వహించి గ్రెనేడ్ ను నిర్వీర్యం చేసి తొలగించారు. ఈ ఫిబ్రవరిలో కూడా ఎర్రకోటలో పోలీసులకు కొన్ని పేలుడు పదార్థాలు దొరికాయి. 2000 సంవత్సరం డిసెంబర్‌లో లష్కరే తోయిబా సంస్థ ఎర్రకోటపై దాడులు చేసింది. అప్పటి నుంచి దీని చుట్టూ కట్టుదిట్టమైన భద్రతావ్యవస్థను ఏర్పరిచారు.