మరింత ప్రమాదకర స్థాయికి మొండిబకాయిలు!
మరింత ప్రమాదకర స్థాయికి మొండిబకాయిలు!
Published Tue, Nov 29 2016 5:47 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగం బ్యాంకుల్లో మొండిబకాయిలు మరింత ప్రమాదకర స్థాయికి పెరిగినట్టు తెలిసింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికి బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)లు సుమారు రూ.80,000 కోట్లకు పెరిగినట్టు వెల్లడైంది. దీంతో సెప్టెంబర్ 30తో పబ్లిక్ రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు రూ.6,30,323 కోట్లకు చేరాయి. జూన్ వరకు ఈ ఎన్పీఏలు రూ.5,50,346 కోట్లగా ఉన్నాయి. ఎన్పీఏలు అధికంగా పెరుగుతున్న ఇన్ఫ్రాక్ట్చర్, పవర్, రోడ్డు, టెక్స్టైల్, స్టీల్ వంటి వాటిలో రంగాల వారీగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ నేడు రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
మొండిబకాయిల కోసం ఆర్థిక దివాలా కోడ్(ఐబీసీ)-2016ను తీసుకొచ్చామని, దాంతోపాటు పలు చట్టాలకు సవరణలు తీసుకొస్తున్నట్టు చెప్పారు. అంతేకాక ఆర్బీఐ కూడా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. కార్పొరేట్ రుణ పునర్నిర్మాణం, జాయింట్ లీడర్స్ ఫోరమ్ ఏర్పాటు, వ్యూహాత్మక రుణ పునర్నిర్మాణ పథకం, వంటి వాటిని ఎన్పీఏల నుంచి బయటపడేందుకు ఆర్బీఐ వాడుతుందని తెలిపారు. ఐరన్ అండ్ స్టీల్ రంగంలో ఇచ్చిన 2.80 లక్షల కోట్ల రుణాల్లో రూ.1.24 లక్షల కోట్లు మొండిబకాయిలుగా మారినట్టు గంగ్వార్ చెప్పారు. కార్పొరేట్కు సంబంధించిన ఏ రుణాన్ని కూడా ప్రభుత్వం మాఫీ చేయలేదని గంగ్వార్ వెల్లడించారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు రుణాలను రైటాఫ్ చేస్తాయని, కానీ బ్రాంచు స్థాయిలో వాటి రికవరీ ఉంటుందని పునరుద్ఘాటించారు.
Advertisement