ఐదేళ్లలో రెండున్నర రెట్లు పెరిగిన సర్కారీ బ్యాంకుల జరిమానా
బ్యాంకుల బిజినెస్ సైతం ఈ స్థాయిలో పెరగలేదు మరి...
ఖాతాలో కనీస నిల్వ లేకపోతే ఒక్కో బ్యాంకుదీ ఒక్కో తీరు
డబ్బులు లేనందుకు డబ్బులే జరిమానాగా చెల్లించాల్సి వస్తే!!. పేదలు కనక పెనాల్టీ చెల్లించాలంటే!!. ఈ దారుణ పరిస్థితి ఇపుడు మన బ్యాంకుల్లో చాలామంది కస్టమర్లకు అనుభవంలోకి వచ్చింది. ఖాతాల్లో కనీస నిల్వలు లేవన్న కారణంతో... ఉన్న కాసింత నగదునూ జరిమానా రూపంలో బ్యాంకులు గుంజేసుకోవటం సాధారణమైపోయింది. అందుకేనేమో... గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వ బ్యాంకులకు ఈ జరిమానాల రూపంలోనే బిలియన్ డాలర్లకు పైగా సొమ్ము వచ్చి పడిపోయింది. మరి ఈ జరిమానాలు కట్టినవారంతా ఎవరు? శ్రీమంతులు కాదు కదా? ఖాతాల్లో కనీసం రూ.5వేలో, 10వేలో ఉంచలేక.. వాటిని కూడా తమ అవసరాలకు వాడుకున్నవారే కదా? ఇలాంటి వారి నుంచి గుంజుకుని బ్యాంకులు లాభాలు ఆర్జించటం... అవికూడా ప్రభుత్వ బ్యాంకులు కావటం మన దౌర్భాగ్యం కాక మరేంటి!.
డిజిటల్ పేమెంట్ల యుగం వచ్చాక బ్యాంకు ఖాతా లేని వ్యక్తులెవరూ లేరన్నది వాస్తవం. పది రూపాయలు పార్కింగ్ ఫీజు కూడా ఆన్‌లైన్లోనే చేస్తున్న పరిస్థితి. నెలకు రూ.5-10 వేలు సంపాదించే వ్యక్తులకూ పేటీఎం, ఫోన్‌పేలే దిక్కు. వీళ్లంతా తమ ఖాతాల్లో రూ.5వేలో, లేకపోతే రూ.10వేలో అలా వాడకుండా ఉంచేయటం సాధ్యమా? అలా ఉంచకపోతే జరిమానా రూపంలో వందలకు వందల రూపాయలు గుంజేసుకోవటం బ్యాంకులకు భావ్యమా? బ్యాంకులు లాభాల్లోకి రావాలంటే ‘డిపాజిట్లు- రుణాల’ వ్యాపారాన్ని మెరుగుపరచుకోవాలి తప్ప ఇలా జరిమానాలతో సంపాదించడం కాదు కదా? గడిచిన ఐదేళ్లలో మన ప్రభుత్వ రంగంలోని 13 బ్యాంకులు కలిసి అక్షరాలా ఎనిమిదివేల నాలుగువందల తొంభై ఐదు కోట్ల రూపాయల్ని ఈ మినిమమ్ బ్యాలెన్స్ లేని ఖాతాల నుంచి గుంజేసుకున్నాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా తెలియజేశారు.
ఎస్‌బీఐ మానేసింది కనక...
2014-15లో ఆర్‌బీఐ సర్క్యులర్ జారీ చేయటంతో పాటు సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విధించింది. వాటికి లోబడి ఆ ఛార్జీలు ఎంతనేది బ్యాంకులే సొంతంగా నిర్ణయం తీసుకుంటాయి. వసూలు చేయాలా? వద్దా? అన్నది కూడా సదరు బ్యాంకుల బోర్డులో నిర్ణయిస్తాయి. 2019-20లో ప్రభుత్వ రంగంలోని 13 బ్యాంకులూ ఈ జరిమానాల కింద రూ.919.44 కోట్లు వసూలు చేస్తే... 2023-24కు వచ్చేసరికి అది అమాంతం రూ.2,331.08 కోట్లకు పెరిగిపోయింది. అంటే రెండున్నర రెట్లు. నిజానికి మన బ్యాంకుల వ్యాపారం కూడా ఈ స్థాయిలో పెరగలేదు. మరో గమనించాల్సిన అంశమేంటంటే 2019-20లో వసూలు చేసిన రూ.919 కోట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటాయే ఏకంగా రూ.640 కోట్లు. అంటే 70 శాతం. ఖాతాదారుల అదృష్టం బాగుండి.. 2020 నుంచి ఈ రకమైన జరిమానాలు వసూలు చేయకూడదని ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఎస్‌బీఐ కూడా ఇప్పటికీ వీటిని వసూలు చేస్తూ ఉంటే ఈ ఐదేళ్లలో మొత్తం జరిమానాలు రూ.15వేల కోట్లు దాటిపోయి ఉండేవేమో!!.
అత్యధిక వసూళ్లు పీఎన్‌బీవే...
ఈ ఐదేళ్లలో 13 బ్యాంకులూ కలిసి రూ.8,495 కోట్లు జరిమానాగా వసూలు చేసినా... అందులో అత్యధిక వాటా నీరవ్ మోడీ స్కామ్‌లో ఇరుక్కున్న పంజాబ్ నేషనల్ బ్యాంకుదే. ఎస్‌బీఐ జరిమానాలు వసూలు చేయటం లేదు కాబట్టి ఆ తరువాతి స్థానంలో ఉండే పీఎన్‌బీ ఏకంగా రూ.1,537 కోట్లను ఖాతాదారుల నుంచి జరిమానాగా వసూలు చేసింది. అత్యంత తక్కువగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రూ.19.75 కోట్లు వసూలు చేసింది. ఇక ఇండియన్ బ్యాంకు రూ.1466 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.1250 కోట్లు, కెనరా బ్యాంకు రూ.1157 కోట్లతో పీఎన్‌బీ తరువాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. వీటిలో కొన్ని బ్యాంకులు నెలవారీ కనీస నిల్వలు లేవన్న కారణంతో... మరికొన్ని బ్యాంకులు క్వార్టర్లీ కనీస నిల్వలు లేవన్న కారణంతో ఈ జరిమానాలు వసూలు చేశాయన్నది మంత్రి వ్యాఖ్యల సారాంశం.
-రమణమూర్తి.ఎం
Comments
Please login to add a commentAdd a comment