రెండెకరాల లోపు రైతులకు రూ. 5వేలు.. ఆపై వారికి రూ.30 వేలు
కాలుష్యం కట్టడికి కేంద్రం నిర్ణయం.. గురువారం నుంచే అమలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యాన్ని అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లోని రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్లే గాలి కాలుష్యం ఎక్కువైందన్న ఆరోపణలొస్తుండటం తెలిసిందే. దీనిని కట్టడి చేసేందుకు రైతులపై జరిమానాలను భారీగా విధించాలని గురువారం కేంద్రం నిర్ణయించింది.
పంట వ్యర్థాలకు నిప్పుపెట్టే రైతులకు జరిమానాలను భూ విస్తీర్ణం ఆధారంగా రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు విధించనున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖలు తెలిపాయి. తాజా నిబంధనల ప్రకారం.. రెండెకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతు తన పొలంలోని వ్యర్థాల్ని కాలిస్తే రూ.5వేలు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇది రూ.2,500 మాత్రమే ఉంది.
అదేవిధంగా, 2 నుంచి 5 ఎకరాల భూమి గల రైతు ఇదే పనిచేస్తే రూ.5 వేలు బదులు ఇకపై రూ.10వేలు కట్టాల్సిందే. అయిదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతు పంట వ్యర్థాలకు నిప్పుపెడితే రూ.30వేల వరకు వసూలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిబంధనలు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయని కేంద్రం ప్రకటించింది.
ఇవి ‘కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ చట్టం–2021’లో భాగమని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 400 మార్క్‌ను దాటడంతో జనం పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కాలుష్యం కట్టడికి తీసుకుంటున్న చర్యలు ఏమిటంటూ గత నెలలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పర్యావరణ పరిరక్షణకు కేంద్రం సరైన చట్టాలను రూపొందించలేకపోతోందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే జరిమానాలను విధించేందుకు ఉద్దేశించిన నిబంధనలను కేంద్రం ప్రకటించింది.
పంజాబ్ రైతు సంఘాల నిరసన
పంట వ్యర్థాల నిర్వహణకు అవసరమైన యంత్రాలను అందించడానికి బదులుగా కేంద్రం జరిమానాలను భారీగా పెంచడంపై పంజాబ్‌లోని రైతు సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. వ్యర్థాల నిర్వహణకు యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో మరోమార్గం లేక దహనం చేస్తున్నామే తప్ప, ఉద్దేశపూర్వకంగా కాదని వారంటున్నారు.
కాలుష్యానికి కారణమంటూ రైతుల వైపు వేలెత్తి చూపుతున్న కేంద్ర ప్రభుత్వం, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న పరిశ్రమలపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదని భారతీయ కిసాన్ యూనియన్(ఏక్తా ఉగ్రహన్) ప్రధాన కార్యదర్శి సుఖ్‌దేవ్ సింగ్ విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 30 శాతం మంది రైతులకు మాత్రమే పంట వ్యర్థాల నిర్వహణ యంత్రాలను అందజేసిందని వివరించారు. పంట వ్యర్థాల వల్ల జరిగే కాలుష్యం కంటే పరిశ్రమలు, రవాణా రంగం వల్లే గాలి కాలుష్యం ఎక్కువని పర్యావరణ నిపుణురాలు సునీతా నారాయణ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment