లోక్‌సభలో జీఎస్టీ బిల్లు | GST Bill in Loksabha | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో జీఎస్టీ బిల్లు

Published Sat, Apr 25 2015 12:47 AM | Last Updated on Sat, Mar 9 2019 3:59 PM

లోక్‌సభలో జీఎస్టీ బిల్లు - Sakshi

లోక్‌సభలో జీఎస్టీ బిల్లు

విపక్ష నిరసనల మధ్య సభ ఆమోదం కోరిన ఆర్థికమంత్రి
ఆదాయం విషయంలో ఆందోళన వద్దని రాష్ట్రాలకు హామీ
స్థాయీసంఘానికి పంపాలని ప్రతిపక్ష సభ్యుల డిమాండ్
తోసిపుచ్చిన ప్రభుత్వం; కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, లెఫ్ట్ వాకౌట్
 
న్యూఢిల్లీ: దేశంలోని పన్ను వ్యవస్థ రూపురేఖల్ని మార్చే సంస్కరాణత్మక ‘వస్తు, సేవల పన్ను(గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్- జీఎస్టీ)’కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు శుక్రవారం లోక్‌సభ ముందుకు వచ్చింది. సమగ్ర అధ్యయనం కోసం బిల్లును స్థాయీసంఘం పరిశీలనకు పంపించాలన్న విపక్ష పార్టీల డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చడంతో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, వామపక్షాల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బీజేడీ, అన్నాడీఎంకే సభ్యులు బిల్లును వ్యతిరేకించారు కానీ వాకౌట్ చేయలేదు. బిల్లును సభ ముందుకు తెస్తూ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బిల్లుకు సంబంధించి రాష్ట్రాల భయాందోళనలను తొలగించే ప్రయత్నం చేశారు.
 
 ఈ పన్ను వ్యవస్థ అమల్లోకి వస్తే రాష్ట్రాల ఆదాయం తగ్గుతుందన్న వాదన సరికాదని, ఇది అందరికీ ప్రయోజనం చేకూరుస్తుందని హామీ ఇచ్చారు.  బిల్లుపై ప్రభుత్వం తొందరపాటుతో వ్యవహరిస్తోందని, బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపించి, ఈ లోపు బడ్జెట్ వ్యవహారాలు పూర్తి చేస్తే మంచిదన్నాయి. అంతకుముందు, బిల్లును సభ ముందుకు తెచ్చేందుకు ఉద్దేశించిన నిబంధనల విషయంలో ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యుల మధ్య గంటపాటు వాగ్వాదం జరిగింది.
 
 అనంతరం, ఇది ముఖ్యమైన బిల్లు కావడంతో సభలోకి బిల్లును అనుమతిస్తున్నానని స్పీకర్ సుమిత్ర మహాజన్ స్పష్టం చేశారు. తర్వాత సభ ఆమోదం కోసం వస్తు, సేవల పన్ను(రాజ్యాంగ సవరణ) బిల్లును జైట్లీ సభ ముందుంచారు. జీఎస్టీతో వాణిజ్యం విస్తృతమవుతుందని, భారత్ ఆదాయం, జీడీపీ పెరుగుతుందని, రాష్ట్రాలకు, కేంద్రానికి.. రెండింటికీ ఇది ప్రయోజనకరమేనని వివరించారు. దీనిద్వారా వస్తుసేవలపై పన్ను విధించే అధికారం కేంద్రం, రాష్ట్రాలు రెండింటికీ లభిస్తుందన్నారు. ఇంకా జైట్లీ ఏమన్నారంటే..
 
 2003లో ఎన్డీఏ హయాంలోనే ఈ బిల్లు రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైంది.  తర్వాతి యూపీఏ ప్రభుత్వమూ సానుకూలంగా ఉంది. బిల్లును స్థాయీ సంఘానికి పంపింది. రెండున్నరేళ్లు స్థాయీసంఘం అధ్యయనం చేసింది. ఇంత విస్తృతంగా చర్చ జరిగిన బిల్లు బహుశా ఇదొక్కటే.


 మీరు(యూపీఏ) చేసిన మంచి పనిని మేం పూర్తి చేస్తున్నాం. అడ్డుకుంటున్నారెందుకు? విలువ ఆధారిత పన్ను(వ్యాట్) విధించినప్పుడు తాము కోల్పోతున్న ఆదాయానికి సంబంధించి ఐదేళ్లే పరిహారం ఇస్తే కుదరదని, ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఇవ్వాలని రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. కానీ ఐదేళ్లు పూర్తయిన తరువాత ఒక్క రాష్ట్రం కూడా పరిహారం డిమాండ్ చేయలేదు.
జీఎస్టీతో రాష్ట్రాలు తమ ఆదాయం కోల్పోతే.. వాటికి మొదటి మూడేళ్లు 100%, నాలుగో ఏడు 75%, ఐదో ఏడు 50% పరిహారం అందుతుంది. ఆరో ఏడాది నుంచి పరిహారం అడగడం మానేస్తారు.
జీఎస్టీ మండలి సభ్యుల్లో రాష్ట్రాల మెజారిటీనే ఎక్కువ. కొన్ని రాష్ట్రాలు కలిసి కూడా మండలి నిర్ణయాల్ని వ్యతిరేకించవచ్చు. మా ప్రభుత్వం అనుసరిస్తున్న సహకార సమాఖ్య విధానానికి ఇదొక మచ్చుతునక.
 
 సమగ్ర అధ్యయనం జరగాలి
ప్రభుత్వ చర్యను విపక్ష సభ్యులు తీవ్రంగా నిరసించారు. జీఎస్టీ బిల్లును పరిశీలనలోకి తీసుకోవద్దని కాంగ్రెస్ సభ్యుడు, లోక్‌సభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ ప్రతిపాదనకు తాము వ్యతిరేకం కాదని, అయితే, ముందు దానిపై స్టాండింగ్ కమిటీలో సమగ్ర అధ్యయనం జరగాల్సి ఉందన్నారు. దానికి చర్చ ప్రారంభమయ్యే లోపు అధ్యయనం చేయొచ్చని జైట్లీ జవాబిచ్చారు. గత సంవత్సరం సభలో బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా స్టాండింగ్ కమిటీకి పంపించకూడదని నిర్ణయం తీసుకున్నారని స్పీకర్ సుమిత్ర మహాజన్ గుర్తుచేశారు. బీజేడీ, టీఎంసీ, సీపీఐ సభ్యులు ప్రభుత్వ చర్యను వ్యతిరేకించారు.
 
 వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వివరాలు..
 దేశంలో పన్ను సంస్కరణలకు సంబంధించి కీలకమైన ఈ బిల్లును గత సంవత్సరం డిసెంబర్ 19న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. జీఎస్టీ అమల్లోకి వస్తే.. సెంట్రల్ ఎక్సైజ్, రాష్ట్రాల వ్యాట్, వినోదపు పన్ను, ఆక్ట్రాయ్, ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, పర్చేజ్ ట్యాక్స్‌ల స్థానంలో ఏకీకృత పన్నుగా వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ఉంటుంది.

మద్యం జీఎస్టీ పరిధిలో ఉండదు. పెట్రోలు, డీజిలు తదతర పెట్రోలియం ఉత్పత్తులను భవిష్యత్తులో దీని పరిధిలోకి తీసుకువస్తారు. భవిష్యత్తులో ఎప్పుడనేది జీఎస్టీ మండలి నిర్ణయిస్తుంది. జీఎస్టీ మండలిలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు రాష్ట్రాల నుంచే ఉంటారు. ఇందులో రాష్ట్రాలకు వీటో అధికారం ఉంటుంది. మండలి తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని కనీసం 75% సభ్యులు ఆమోదించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement