ఉమ్మడి నియంత్రణపై పీటముడి
జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కుదరని ఏకాభిప్రాయం
ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ అమలుపై నీలినీడలు
సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ నమూనా చట్టాలపై అంగీకారం
పరిహార నిధిని పెంచాలని రాష్ట్రాల డిమాండ్
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులపై ఉమ్మడి నియంత్రణ అంశంలో శుక్రవారం ముగిసిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ అమలు దాదాపు అసాధ్యమేనని భావిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శుక్రవారం రెండో రోజు భేటీలో కేవలం జీఎస్టీ సహాయ చట్టాలపై అంగీకారం కుదిరింది. గత మూడు సమావేశాల నుంచి ఉమ్మడి నియంత్రణ, కీలకమైన ఐజీఎస్టీ(ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ)పై కేంద్ర, రాష్ట్రాలు ప్రదర్శిస్తోన్న పట్టువిడుపు ఈ భేటీలోను కొనసాగింది. దీంతో జనవరి 3, 4 తేదీల్లో నిర్వహించే తదుపరి భేటీలో వీటిపై అవగాహనకు రావచ్చని భావిస్తున్నారు. సెప్టెంబర్‌లో జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపాక ఇంతవరకూ ఏడుసార్లు జీఎస్టీ కౌన్సిల్ భేటీ కాగా... కీలక అంశాలపై మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు. అలాగే రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారాన్ని నాలుగు నెలలకు బదులు రెండు నెలలకోసారి చెల్లించాలని భేటీలో నిర్ణయించారు. నోట్ల రద్దుతో రాష్ట్రాలS ఆదాయాలకు గండి పడిందని, పరిహార నిధిని పెంచి ఆదుకోవాలంటూ రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి.
ఏప్రిల్ 1 గడువుకు కట్టుబడి ఉన్నా: జైట్లీ
భేటీ అనంతరం జైట్లీ మాట్లాడుతూ... సీజీఎస్టీ(కేంద్ర జీఎస్టీ), ఎస్జీఎస్టీ(రాష్ట్రాల ఎస్జీటీ) నమూనా చట్టాలపై ఏకాభిప్రాయంతో పాటు పరిహార చట్టంపై అవగాహన కుదిరిందన్నారు. ‘అంగీకారం కుదరని ప్రధానాంశాల గురించి చెప్పాలంటే...ఐజీఎస్టీ, ఉమ్మడి నియంత్రణలపై ఏకాభిప్రాయం రాలేదు. ఉమ్మడి నియంత్రణపై జనవరి 3, 4 తేదీల్లో జరిగే సమావేశంలో చర్చిస్తాం. ఆ తర్వాతే ఏ వస్తువులు ఏ పన్ను పరిధిలోకి రావాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాం’ అని జైట్లీ పేర్కొన్నారు. ఏప్రిల్ 1న జీఎస్టీ అమలుకు కట్టుబడి ఉన్నారా? అని విలేకరులు ప్రశ్నించగా... ‘అందుకోసం శక్తి మేర ప్రయత్నిస్తున్నా.’ అని చెప్పారు. ఇంతవరకూ అన్ని నిర్ణయాలు ఏకాభిప్రాయంతోనే తీసుకున్నామని, ఎక్కడా ఓటింగ్ లేదా ఇచ్చి పుచ్చుకునే ధోరణి అవలబించలేదన్నారు.
నమూనా చట్టాలకు ఆమోదం
జీఎస్టీ చట్టం ఆమోదం అనంతరం అమలుకు పరిశ్రమ వర్గాలు కోరుతున్న మూడు నెలల గడువుపై స్పందిస్తూ... అన్ని అడ్డంకులు అధిగమించాక ఆ అంశంపై చర్చిస్తామన్నారు. ‘మన ప్రయత్నం ఏంటంటే... వీలైనంత త్వరగా జీఎస్టీ ఆమోదం పొందడం.. మనం సరైన దిశలో వెళ్తున్నామని నేను భావిస్తున్నా’ అని చెప్పారు. గత మూడు సమావేశాల్లో భవిష్యత్ నమూనా చట్టాలతో పాటు సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ నమూనా చట్టాల్లో 197 నిబంధనలు, 5 ప్రకరణల్నీ ఆమోదించామని వెల్లడించారు. ఉమ్మడి నియంత్రణపై మాట్లాడుతూ... ‘కేవలం ఒకే జీఎస్టీ చట్టం, రెండు నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయని... అయితే పన్ను లెక్కల నిర్వహణ పరిధిని ఎలా విభజించాలన్నదే అసలు ప్రశ్న. అది చర్చల ద్వారానే పరిష్కారమవుతుంది’ అని తెలిపారు.
మాకూ పరిహారం కావాలి.. జీఎస్టీ అమలు అనంతరం కేవలం 4, 5 రాష్ట్రాలకు పరిహారం చెల్లిస్తే సరిపోతుందని కేంద్రం భావించగా... తాజాగా మరిన్ని రాష్ట్రాలు తమకూ పరిహారం చెల్లించాలంటూ ముందుకొస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పడ్డ నష్టాల నుంచి గట్టెక్కేందుకు సాయం చేయాలని చాలా రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమచారం. దీంతో పరిహార చట్టంలో మార్పులు చేయనున్నారు. సెస్సు వసూలుతో ఏర్పాటు చేసే పరిహార నిధి మొత్తాన్ని పెంచడంతో పాటు.. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన ఇతర పన్నులపై కూడా సెస్సు విధించే అవకాశముంది. ఈ అంశంపై జైట్లీ స్పందిస్తూ... ‘పరిహారం కేవలం జీఎస్టీ అమలుకు సంబంధించింది మాత్రమే’ అని పేర్కొన్నారు. ప్రతి రెండు నెలలకు రాష్ట్రాలకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు.
నోట్ల రద్దుతో 30% ఆదాయం కోల్పోయాం: రాష్ట్రాలు
ప్రస్తుతం నిర్ణయించిన రూ. 55 వేల కోట్ల పరిహార నిధి సరిపోదంటూ భేటీ అనంతరం పలు రాష్ట్రాలS ఆర్థిక మంత్రులు పేర్కొన్నారు. నోట్ల రద్దు అనంతరం చాలా రాష్ట్రాల ఆదాయాలు గణనీయంగా తగ్గాయని, ఈ పరిస్థితుల్లో కేంద్రమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 20–30 శాతం వరకూ మూడో, నాలుగో త్రైమాసికాల్లో రాష్ట్రాలు ఆదాయాన్ని నష్టపోయాయని పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా చెప్పారు. తమిళనాడు, జమ్మూ కశ్మీర్ ఆర్థిక శాఖ మంత్రులూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.