రెండు వారాల్లో చోరీలు గ్యారంటీ!
‘రెండు వారాల్లో ఇంగ్లిష్ గ్యారంటీ’ అంటూ ఢిల్లీలోని ఆ కోచింగ్ సెంటర్ కూడా ప్రకటనలు ఇస్తుంది. కానీ అందులో చేరేవారు రాంగ్ రూట్‌లోకి మళ్లినట్లే! అక్కడ ఇంగ్లిష్ మాత్రమే కాదు.. చోరీలూ నేర్పిస్తారు! ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ రాజీవ్ సహానీయే ఆ కోచింగ్ సెంటర్ యజమాని. వివరాల్లోకెళితే.. యూపీలోని గోరఖ్‌పూర్‌కు చెందిన రాజీవ్ నిరుద్యోగి. ఇంగ్లిష్ కోచింగ్ ముసుగులో.. ఏటీఎం చోరీలకు పెద్ద ప్లాన్ వేశాడు. చురుకైన విద్యార్థులను ఎంచుకుని వారిని ప్రలోభపెట్టి చోరీలవైపు మళ్లించడం మొదలుపెట్టాడు.
తొలుత థియరీ క్లాస్‌లు బోధించి, తర్వాత ఏటీఎం కేంద్రాలకు తీసుకెళ్లి మరీ ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చేవాడు. మహిళలు, వృద్ధులకు సహాయం చేస్తున్నట్లు నటించి.. వారు పిన్ ఎంటర్ చేయగానే ఓ మైక్రోచిప్‌ను లేదా పిన్నును కీప్యాడ్‌లోపలికి చొప్పిస్తే స్క్రీన్ బ్లాంక్ అయిపోతుంది. దీంతో యంత్రం పనిచేయడం లేదు. వేరే చోటికి వెళ్లండని చెప్పి.. వారు వెళ్లిపోగానే మైక్రోచిప్‌ను తీసేసి డబ్బులు డ్రా చేసుకుంటారు. ఇదీ ప్లాన్. ఈ పద్ధతిలోనే చోరీలు చే యిస్తూ.. టీమ్ సభ్యులకు కొన్నాళ్లు నెలజీతం ఇచ్చాడు. చోరీలు పెరగడంతో వారికి వాటాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు చిల్లిగవ్వ లేకుండా రోడ్లపై తిరిగిన రాజీవ్ కొద్దిరోజులకే హోండా సిటీ కారులో తిరిగేంతగా ఎదిగాడు. ఇంటికి వేలకు వేలు పంపేవాడు. కానీ.. ఎక్కడైతే ప్లాన్ వేసుకున్నాడో.. ఇప్పుడు అక్కడికే చేరాడు. 2011లో దొంగతనం కేసులో కొన్నాళ్లు జైలులో ఉన్నప్పుడు తోటి ఖైదీ ద్వారా ఏటీఎం చోరీల గురించి తెలుసుకున్నాడు. తాజాగా ఎంత పక్కాగా పనికానిచ్చినా.. పోలీసులకు దొరికిపోవడంతో మరోసారి కటకటాల వెనక్కి చేరాడు.