ఆరేళ్లుగా సీబీఐ అధికారినని నమ్మించాడు
పాలన్పూర్(గుజరాత్): తాను సీబీఐ అధికారినని సొంత ఊరి ప్రజలను నమ్మించాడు. అలా ఒకటి కాదు రెండు ఏకంగా ఆరేళ్ల నుంచి అదే చెప్తూ అందరిని నమ్మబలికించి గ్రామంలో అధికారం చెలాయించాడు. సొంతంగా ఒక గుర్తింపుకార్డును కూడా సృష్టించుకున్నాడు. చివరికి ఆ విషయం ఇన్నాళ్లకు బయటకు పొక్కి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బనస్కాంత జిల్లాలోని జాదు గ్రామానికి చెందిన భరత్ ఠాకూర్ అనే వ్యక్తి ఒక నిరుద్యోగి. అయితే, తాను ఢిల్లీలోని సీబీఐ ఉన్నత కార్యాలయంలో అధికారం చెలాయిస్తున్నానని 2009 నుంచి చెప్తూ వస్తున్నాడు.
తమ వాడు ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థలో పనిచేస్తున్నాడని ఇటు కుటుంబీకులు, అటు బంధువులు నమ్మారు. గ్రామస్థులు కూడా అతడికి మంచి గుర్తింపునిచ్చి ఎన్నో కొత్త కార్యక్రమాలు అతడితో ప్రారంభింపజేశారు. చివరికి ఈ విషయం పోలీసులకు తెలిసి అతడి ఇంటికి వెళ్లి ప్రశ్నించగా.. నిజం చెప్పేందుకు నిరాకరించాడు. దీంతో పోలీసులు తనిఖీలు నిర్వహించగా అతడి నుంచి సీబీఐ నకిలీ గుర్తింపుకార్డు, తదితర నకిలీ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం అతడిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు.