పంజరంలో ఉంటే పరువేదీ? | Abk prasad guest column on CBI and politics | Sakshi
Sakshi News home page

పంజరంలో ఉంటే పరువేదీ?

Published Tue, Oct 31 2017 12:19 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

Abk prasad guest column on CBI and politics - Sakshi

రెండో మాట

హంతకులుగా నమోదైన కొందరు కొన్ని రాష్ట్రాలలో స్పీకర్లుగా చెలామణీ అవుతున్న ఉదాహరణలూ దేశంలో ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో కాబోలు, ప్రధాని మోదీ ప్రత్యర్థి పార్టీలనుద్దేశించి నోరు మెదపవద్దని ఇలా హెచ్చరించారు: ‘మీ నాలుకలు జాగ్రత్త, మీ అందరి జాతకాలు నా దగ్గరున్నాయి సుమా’ అని! ప్రతిపక్షాలనేమిటి, న్యాయ, విద్యా, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక, పరిశోధనా శాఖలన్నింటి బోర్డులు తిప్పేసి అనిర్వచనీయమైన ‘హిందూత్వ’ వాహినిగా మలచాలన్న ‘యజ్ఞం’ ప్రారంభమైందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.

‘కేంద్ర విచారణ (నిఘా) సంస్థ సీబీఐ ఇటీవల కాలంలో నిర్వహించిన అవమానకర పాత్ర దృష్ట్యా ఆ సంస్థ దీర్ఘకాలం దేశానికి చేసిన సేవలను విస్మరించరాదు. ఒక స్వతంత్ర సంస్థగా, లక్ష్య నిర్వచనతో అనేక సంవత్సరాల పాటు నిష్పాక్షిక దృష్టితో సీబీఐ సేవలు అందించింది. అయితే సీబీఐ ప్రతిష్ట ఇటీవల కొలది సంవత్సరాలుగా మసకబారింది. ఈ సంస్థ డైరెక్టర్లలో కొందరు ప్రజలలో అంతగా విశ్వాసాన్ని పాదుకొల్పలేకపోయారు. క్రమంగా ఈ సంస్థ ‘పంజరంలో చిలుక’ అన్న అపకీర్తిని ఆపాదించుకుంది. అవినీతి ఆరోపణల భారంతో సంస్థ సంచాలకులు (డైరెక్టర్లు) కొందరు విచారణను ఎదుర్కొనవలసి వచ్చింది.         – నవనీత్‌ రంజన్‌ వాసన్, (డైరెక్టర్‌ జనరల్, పోలీస్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బ్యూరో, రిటైర్డ్‌)  


‘అధికారుల స్థాయిలో ఉన్న బలవంతుల మీద నమోదయ్యే కేసులను విచారించవలసి వచ్చిన సమయాలలో ఇప్పటికీ సీబీఐ ప్రజలను నిరాశ పరుస్తూనే ఉండడం విచారకరమని జస్టిస్‌ జేఎస్‌ శర్మ (2009) విమర్శించవలసి వచ్చింది. సీబీఐ పాలకుల పంజరంలోని చిలుక (2013) అని సుప్రీంకోర్టు వర్ణించింది’.     – ప్రకాశ్‌ సింగ్‌ (సరిహద్దు భద్రతాదళాల విశ్రాంత డైరెక్టర్‌ జనరల్‌)

మూడు నెలల క్రితమే స్వతంత్ర భారతానికి 70 ఏళ్లు పూర్తయ్యాయి. తొలి పాతిక సంవత్సరాలు కాబోలు దేశాన్ని అట్టట్టా అవినీతికి దూరంగా ఉన్నట్టు, లేదా ఉంచినట్టు భ్రమలు కల్పించారు. మూడు దశాబ్దాలలోపుననే ముంద్రా కుంభకోణంతో ప్రారంభమైన అవినీతి (ఫిరోజ్‌ గాంధీ బయటపెట్టారు) అంతటా అల్లుకుపోయింది. పాలకవర్గాలలోకి, రాజకీయ రంగ ప్రముఖులు, చట్టసభల సభ్యులు, న్యాయమూర్తులు, పత్రికా రంగం, అధికారగణాలు ఆఖరికి కొందరు సైనికాధికారులు, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల వరకు ఆ అవినీతి విస్తరించింది. ఈ నేపథ్యంలోనే లంచగొండితనాన్ని, అవినీతిని అరికట్టడానికి సదుద్దేశంతో పాలక వ్యవస్థ నెలకొల్పినవే సీబీఐ, ఇన్‌కమ్‌ట్యాక్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖలు. కానీ ఇవి క్రమంగా పాలక వర్గాల ఒత్తిళ్లకు లోనయ్యాయి. వీటితో పాటు ఎన్నికల కమిషన్‌ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం పాలకుల కనుసన్నలలోకి వెళ్లిపోయింది.

సీబీఐకి తొలి కఠిన పరీక్ష
కాంగ్రెస్‌/కాంగ్రెస్‌–యూపీఏ; బీజేపీ–ఆరెస్సెస్‌–ఎన్డీఏ హయాంలలో పేరుకుపోయిన అవినీతిని బద్దలు కొట్టడం కోసం వివిధ స్థాయిలలో ఉద్యమాలు మొదలైనాయి. లోక్‌పాల్‌ వ్యవస్థ పటిష్టం కావడానికి జరుగుతున్న ఆందోళనలు అవినీతి వ్యవస్థకు జవాబుగా బలమైన ఒక ప్రతిపాదనను ముందుకు నెట్టాయి కూడా. అదే– కేంద్రం అదుపాజ్ఞల నుంచి తప్పించి స్వతంత్ర విచారణ సంస్థగా సీబీఐని నిలబెట్టడం. ఒక రాజకీయ పార్టీ నాయకత్వంలో ఐదేళ్లకు ఒకసారి ఏర్పడే ప్రభుత్వానికి సీబీఐ అధికారులను నియమించే లేదా బదలీ చేసే అధికారం ఇప్పటి మాదిరిగా ఉండరాదన్నదే ఆ ప్రతిపాదన ఉద్దేశం. అంటే రాజకీయంగా తమకు అనుకూలురైన వారిని ఆయా పదవులలో ప్రతిష్టించే అవకాశం లేకుండా చేయడమే. అప్పుడు మాత్రమే సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరించగలుగుతుంది. ఇందుకు సంబంధించిన కదలిక 1990లో న్యాయ వ్యవస్థలో మొదలైంది.

ఆ సంవత్సరంలో వచ్చిన జైన్‌–హవాలా డైరీల కేసు సీబీఐకి తొలి సవాలును విసిరింది. స్వతంత్ర ప్రతిపత్తి లేకపోవడంతో ఎదురైన సవాలే అది. ఆ కేసులో తొలిసారి సీబీఐ పదిమంది రాజకీయవేత్తలపైన, ముగ్గురు కేబినెట్‌ మంత్రుల మీద చార్జిషీట్లు సిద్ధం చేసి తన బాధ్యతను నిర్వర్తించింది. అప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆ చార్జిషీట్లలో కొన్ని లోపాలు చోటు చేసుకున్నాయన్న విమర్శ తప్పలేదు. ప్రఖ్యాత పత్రికా రచయితలు వినీత్‌ నారాయణ్, రాజీందర్‌ పురీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంతో ఈ డొంకంతా కదిలింది. ఈ పిల్‌ను సుప్రీంకోర్టు వెంటనే (అక్టోబర్‌ 10, 1993) అనుమతించి, తక్షణం విచారణ జరపవలసిందిగా సీబీఐని ఆదేశించింది. అక్కడితో ఆగిపోకుండా, జరుగుతున్న తాత్సారాన్ని చూసి, విచారణను త్వరితం చేసి నివేదికలు పంపవలసిందని కూడా (1994) ఆదేశాలు ఇచ్చింది. అప్పటికీ సీబీఐకి ఒత్తిళ్లు తప్పని సంగతిని గుర్తించి, ఘాటైన విమర్శలు (డిసెంబర్‌ 5, 1994) కూడా చేసింది. ‘చిన్నచిన్న నేరాలు చేసిన వారిని శిక్షించి, పుట్టినరోజు ఉత్సవాల మీద లక్షలు లక్షలు డబ్బు దుబారా చేసే సంపన్నులను స్వేచ్ఛగా వదిలేయడానికి కారణాలున్నాయని భావించే పక్షంలో మేం కోర్టుల్ని మూసేసుకుంటే మంచిదేమో! పోలీస్‌ ఠాణేదార్‌ పరి ష్కరించగల సమస్యను సీబీఐ శక్తికి మించిన పని అని భావించలేం. ఇకమీద విచారణ జరిగినన్ని రోజులు సీబీఐ డైరెక్టరే హాజరవుతూ ఉండాలి’ అని కోర్టు ఆదేశించింది. ఒకవేళ ప్రధాన నిందితుడు ఎన్‌.కె. జైన్‌ విదేశాలకు పోవడానికి కింది కోర్టు అనుమతిస్తే ‘పై కోర్టుకు రావడానికి సీబీఐని అడ్డుకున్నదెవరో చెప్పాల’ని కూడా గద్దించింది. సీబీఐ రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోవడానికి వీల్లేదని నాడే హెచ్చరించింది (మార్చి 26, 1995).

అంతేగాదు, ప్రభుత్వ రంగానికి చెందిన 13మంది ఉన్నతాధికారులపైన సీబీఐ చార్జిషీట్ల (నవంబర్‌ 28,1995) దాఖలు చేసినప్పుడు కూడా సుప్రీం ‘ఈ కేసులో ఇంకా అనేకమందికి సంబంధం ఉంది. బడాబడాలను పట్టుకోండ’ని ఆదేశించవలసి వచ్చింది. ఈ కేసు చార్జిషీట్లలో అడ్వాణీ సహా పలువురు కాంగ్రెస్‌ నాయకులూ ఉన్నారు. ఈ నాయకుల నేరాలకు సంబంధించిన తేదీలు గానీ, జరిగిన ప్రదేశాల వివరాలుగానీ ఎందుకు కనుమరుగైనాయని కూడా సుప్రీం ప్రశ్నించింది. నిజమే మరి! ఇటీవలి ఒక ఉదాహరణ చూద్దాం! అనేక కేసులలో అనేక రాష్ట్రాల్లో (ఏపీ సహా) వివిధ సందర్భాల్లో స్థానిక సీఐడి/సిట్‌/స్పెషల్‌ ఇన్‌వెస్టిగేషన్‌ బృందాలు జరిపిన దర్యాప్తులలో రుజువులేని నేరాలపై అరెస్టు అయి జైళ్లలో మగ్గుతూ వచ్చిన యువకులు కనీసం 50–60 మందిని కోర్టులు నిర్దోషులుగా విడుదల చేశాయి. ఇంకొన్ని రాష్ట్రాల్లో అధికారపక్షం ఒత్తిళ్లపై సీబీఐ/ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖలు మోపే కేసులు ఏళ్ల తరబడి కొనసాగిస్తున్నప్పుడు ఆ తాత్సారాన్ని సీబీఐ స్పెషల్‌ కోర్టులు ప్రశ్నించాయి.


సీబీఐపై రాజకీయ ఒత్తిళ్లవల్ల జరుగుతున్న నష్టం స్వభావం ఏమిటో ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తులు జె.ఎస్‌.శర్మ, ఎస్‌.సి. బరూచాల ధర్మాసనం ఇలా శఠించింది: ‘చార్జిషీటులో ఉండవలసిన 10 మందిలో 9మందినే ఉంచి మిగతా ఒక్కడ్నే మినహాయించినా ఆమోదయోగ్యం కాదు, సంతోషించదగిన విషయమూ కాదు– ఎందుకు మినహా యించాల్సి వచ్చిందో మాకు కారణం స్పష్టం కావాలి’ అన్నారు. ఇందుకు అసలు కారణం వలస పాలన నాటి పాత చట్టాలే (19వ శతాబ్ది నాటి 1860 పీనల్‌ కోడ్, 1861 నాటి పోలీస్‌ యాక్ట్, 1870 నాటి ఎవిడెన్స్‌ యాక్టు, 1908 నాటి సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ వగైరా)నని సరిహద్దు భద్రతా దళాల మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ప్రకాశ్‌ సింగ్‌ చెప్పారు. 1941 నాటి యుద్ధకాలంలో స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌గా ‘యుద్ధశాఖ’లో అంతర్భాగమైన సంస్థ ఇది. 1963లో ఈ స్పెషల్‌ పోలీసుశాఖనే సీబీఐగా మార్చారు. కేంద్ర ప్రభుత్వోద్యోగుల నియామకాల మంత్రిత్వశాఖ కింద పనిచేసే సంస్థగా దీనిని మార్చడంతో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆచరణలో రాజకీయ పార్టీ ఒత్తిళ్ల ప్రకారమే సీబీఐ నడుచుకోవలసి వస్తోంది.

స్వేచ్ఛ ఇంకెప్పుడు?
ఈ ‘పంజరం’ కట్టల్ని తెంచేయడం కోసమే కేంద్రీయ సాధికార కమిటీలు– ఎల్‌.పి.సింగ్‌ కమిటీ (1978) సమర్పించిన 19వ పార్లమెంటరీ స్థాయీ సంఘం (2007), 24వ పార్లమెంట్‌ స్థాయీ సంఘం (2008) ఎన్నో ప్రజోపయోగకర సిఫారసులు చేశాయి, సీబీఐని స్వతంత్ర విచారణ సంస్థగా నిలబెట్టడానికి ప్రయత్నించాయి. కానీ వారి యత్నం బూడిదలో పోసిన పన్నీరయింది. విచారణ సంస్థల విచారణ తంతులను రాష్ట్ర హైకోర్టు గౌరవ న్యాయమూర్తి (రిటైర్డ్‌) జస్టిస్‌ చంద్రకుమార్‌ కూడా విమర్శించినట్టు గుర్తు.

విచారణలో ఉన్న కేసు తుది నివేదిక పైన విచారణ సంస్థ సమర్పించే దాకా కోర్టు ఏ నిర్ణయమూ తీసుకోదు. కానీ విచారణ సంస్థలే కోర్టులలో ఉన్న కేసులకు మోక్షం కల్గించవు. కారణం గురించి సీబీఐ కోర్టు ‘పరిభాషలో’ సీబీఐ రాజ కీయ పక్ష ‘పంజరంలో ఉన్న పక్షి’. పదిహేనేళ్లుగా ములాయంసింగ్‌ యాదవ్, లాలూ, రబ్రీదేవి, యడ్యూరప్ప వగైరాలపై నడుస్తున్న అవినీతి ఆరోపణ కేసులు, ఎన్నికలలో అవినీతికి సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలపై పెల్లుబుకిన కేసులు కోర్టులలో నానుతూ ఉండిపోవడానికి కారణం– అవినీతిపాలైన రాజకీయ వ్యవస్థను సాకుతున్న శక్తులే. కాంగ్రెస్‌ బోఫోర్స్‌ కేసు, బీజేపీ హయాంలో మంత్రులు తలపెట్టిన సైనిక శవపేటికల కుంభకోణం, తెహెల్కా–స్పై కెమెరాకు దొరికిపోయిన బంగారు లక్ష్మణ్‌ అవి నీతి, టీడీపీ పాలనలో ప్రపంచబ్యాంక్‌ అనుబంధ సంస్థ డి.ఎఫ్‌.ఇ.డి ప్రొఫెసర్‌ జేమ్స్‌మానర్‌ నివేదికలో నమోదు చేసిన ముఖ్యమంత్రి అవినీతి, నిధుల తరలింపు 2016లో బీజేపీకి మళ్లిన 90 శాతం కార్పొరేట్‌ డొనేషన్ల భాగోతం (706 కోట్లు) ‘పార్లమెంటు, శాససభ అవినీతికర సభ్యులు తిరిగి అధికారానికి వచ్చార’నీ, మేట వేసుకున్న వీరి అసాధారణ సంపదపై విచారణ అవసరమన్న సుప్రీం కోర్టు తాజా ఆదేశం (13.9.2017) అందిస్తున్న సందేశం ఏమిటో ప్రజలు గమనిస్తారు.

హంతకులుగా నమోదైన కొందరు కొన్ని రాష్ట్రాలలో స్పీకర్లుగా చెలామణీ అవుతున్న ఉదాహరణలూ దేశంలో ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కాబోలు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యర్థి పార్టీలనుద్దేశించి నోరు మెదపవద్దని ఇలా హెచ్చరించారు: ‘మీ నాలుకలు జాగ్రత్తగా పెట్టుకోండి, మీ అందరి జాతకాలు నా దగ్గరున్నాయి సుమా’ అని! ప్రతిపక్షాలనేమిటి, న్యాయ, విద్యా, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక, రోదసీ ఖగోళ శాస్త్ర పరిశోధనా శాఖలన్నింటి బోర్డులు తిప్పేసి అనిర్వచనీయమైన ‘హిందూత్వ’ వాహినిగా మలచాలన్న బృహత్‌ ప్రయత్నం లేదా ‘యజ్ఞం’ అధికార స్థాయిలో ప్రారంభమైందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. నోట్ల రద్దుకు, వస్తు, సేవా రంగాలపై దండిగా జీఎస్టీ దంచి కొట్టడానికి దేశ జనాభాలో ఒక్కరూ బీరుపోకుండా ‘125 కోట్ల’మందీ ‘మద్దతు’ పలికారనీ ఊదరకొట్టిన నాయకత్వం ఎంతకైనా దిగజారిపోగల శక్తి కలదని రుజువైపోయింది. ఏనాడైనా 545 మంది సభ్యుల పార్లమెంటు బలం 125 కోట్ల భారత ప్రజల బలం ఎదుట దిగదుడుపేనని పెందలాడే గ్రహించడం మంచిది కాదా?!
 


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
ఈమెయిల్‌: abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement