
గల్ఫ్‌కు వలస వెళ్లకుండా చట్టం
♦ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఐటీ మంత్రి కేటీఆర్
♦ ఇంటి పనుల కోసం వెళ్తున్న మహిళలకు ఇబ్బందులు
♦ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి
♦ విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మంత్రి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఇళ్లలో పనుల కోసం మహిళలు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లకుండా చట్టాలను సవరించాలని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఈ మేరకు వలసల నిషేధ చట్టాన్ని తీసుకువస్తే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని కేంద్రానికి తెలిపినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా గల్ఫ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిర్వహిస్తున్న రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లిన తెలంగాణ యువత, మహిళలు పడుతున్న ఇబ్బందులను శుక్రవారమిక్కడ మంత్రి కేటీఆర్ విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.
భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘గల్ఫ్ దేశాల్లో తెలంగాణవాసుల ఇబ్బందులను కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలి. వారి కష్టాలకు బాధ్యులైనవారిపై కఠినంగా వ్యవహరించాలి. సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో వసూలు చేసిన సొమ్ము ను గల్ఫ్ వాసుల సంక్షేమానికి వినియోగించాలి. ఆ దేశాలకు వలస వెళ్లే వారి వివరాలను కంప్యూటర్‌లో నిక్షిప్తం చేయాలి. దీంతో వివిధ వీసాలపై వెళ్లేవారు నిర్దిష్ట కాల పరిమితిలోగా వెనక్కి రాకుంటే వారి సమాచారం తెలుస్తుంది. ఏదైనా సమస్య తలెత్తితే పరిష్కరించేందుకు కూడా ఆ వివరాలు దోహదపడతాయి’’ అని కేటీఆర్ చెప్పారు. అన్ని రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాములుగా చేసి ఒక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి సమీక్ష చేయాలని కేంద్రానికి విన్నవించినట్లు తెలిపారు. అధికారులతో జరిపిన సమావేశంలో ఎంపీ వినోద్‌కుమార్, ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్, గల్ఫ్ బాధిత మహిళలు ఉన్నారు.
ఏపీ మహిళల గోడు వివరించిన మంత్రి రావెల
గల్ఫ్‌లో ఏపీ బాధిత మహిళల గోడును ఆ రాష్ట్ర మంత్రి రావెల కిషోర్‌బాబు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులకు వివరించారు. తెలుగు మహిళలు గల్ఫ్ దేశాల్లో కష్టాలు పడటం ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని, ఉద్యోగాల పేరిట గల్ఫ్ దేశాలకు తరలిస్తున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే వలసలు ఆగుతాయన్నారు. అవసరమైతే ఉపాధి కోసం ప్రభుత్వమే గల్ఫ్ దేశాలకు పంపే అవకాశాలను పరిశీలించాలన్నారు. గల్ఫ్ బాధిత మహిళలను వారి సొంత ప్రాంతాలకు తరలించడానికి నిధిని ఏర్పాటు చేసి, ఆయా మహిళల సంక్షేమానికి ఉపయోగించాలన్నారు.