ఒక్క శాతమే కదా... అనుకోవద్దు
మొత్తంగా మిగిలేది 2 లక్షలపైనే..!
0.15 శాతం తగ్గినా గణనీయమైన ఆదా
తగ్గుతూ వస్తున్న గృహ రుణ వడ్డీ రేట్లు
మున్ముందు మరింత తగ్గే అవకాశం
తాజాగా రుణం తీసుకుంటున్న వారికే కొత్త రేట్లు
గృహ రుణాలపై 0.15 శాతం వడ్డీని తగ్గిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 24 గంటలు కూడా తిరక్కముందే ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కూడా అదే స్థయిలో తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. మిగిలిన బ్యాంకులూ వీటిని అనుసరించే అవకాశం కనిపిస్తోంది. నిజానికి ఆర్‌బీఐ గడచిన కొన్ని సంవత్సరాలుగా వడ్డీ రేట్లను మెల్లగా తగ్గిస్తూ వస్తోంది. ఆ మేరకు బ్యాంకులైతే తగ్గించటం లేదు. సరే! ఆ సంగతి పక్కనబెడితే ఇప్పటికై నా... కొంతైనా తగ్గిస్తున్నందుకు కాస్త సంతోషించాలి. అసలింతకీ బ్యాంకులు 0.15 శాతం తగ్గిస్తే వినియోగదారులకు ఏమైనా తగ్గుతుందా? కొత్తగా రుణం తీసుకున్న వారికి ఏ మేరకు లబ్ధి కలుగుతుంది? ఈ తరుణంలో ఫిక్స్‌డ్ రేటుకు రుణం తీసుకుంటే మంచిదా... లేక ఫ్లోటింగ్ రేటుకు రుణం తీసుకుంటే మంచిదా? గృహ రుణం చుట్టూ తిరిగే సందేహాలకు సమాధానమే ఈ ప్రాఫిట్ ప్రత్యేక కథనం...
- సాక్షి, పర్సనల్ ఫైనాన్‌స విభాగం
తగ్గుతుంటే ఏం చేద్దాం ..
ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. ఇప్పటికే గృహ రుణాలు తీసుకున్న వారి ముందు రెండు ప్రత్యామ్నాయ మార్గాలుంటారుు. ఈఎంఐ కింద కట్టాల్సిన మొత్తాన్ని కొంత తగ్గించుకోవడం... వ్యవధిని తగ్గించుకోవడం.
సాధారణంగా బ్యాంకులు వ్యవధిని తగ్గించడం ద్వారా ప్రయోజనాన్ని ఖాతాదారు లకు బదిలీ చేసే అవకాశం ఉంటుంది. కనుక ఏ రకంగా సర్దుబాటు చేయబోతున్నారో బ్యాంకును అడగాలి.
ఈఎంఐ మొత్తాన్ని తగ్గించుకోవాలనుకుంటే బ్యాంకుకు తెలియజేసి .. కొత్తగా మరో ఈసీఎస్ (ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్) సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఒకవేళ మిగతా బ్యాంకులకన్నా మీ బ్యాంకు అధిక వడ్డీ రేటు వసూలు చేస్తున్న పక్షంలో.. తక్కువ వడ్డీ రేటు ఉన్న వేరే బ్యాంకుకు మీ రుణాన్ని బదలాయించుకోవచ్చు. దీనికి కొంత ప్రాసెసింగ్ ఫీజుంటుంది కానీ కొన్ని బ్యాంకులు దీన్ని మినహాయింపునిస్తున్నాయి. రుణ బదిలీ ప్రక్రియలో ఎదురయ్యే వ్యయాల కన్నా ప్రయోజనాలే ఎక్కువగా ఉంటేనే ట్రాన్‌సఫర్ చేసుకోవాలి. ఫ్లోటింగ్ రేటుపై తీసుకున్న గృహ రుణాల ముందస్తు చెల్లింపులపై సాధారణంగా బ్యాంకులు ప్రీపేమెంట్ చార్జీలు వసూలు చేయడం లేదు. ఫిక్స్‌డ్ రేటుపై కొంత చార్జీలు వసూలు చేస్తున్నాయి.
పెరుగుతున్న గృహరుణాలు
రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం గతేడాది ఆగస్టులో రూ.6,74,500 కోట్ల మేర హౌసింగ్ లోన్‌స ఉన్నారుు. అవి ఈ ఏడాది ఆగస్టుకల్లా 17 శాతం వృద్ధితో రూ.7,86,900 కోట్లకు చేరాయి. కార్పొరేట్ తదితర విభాగాల్లో రుణాల వృద్ధి అంతంతమాత్రంగానే ఉండటం, హౌసింగ్ పోర్ట్‌ఫోలియోలో మొండిబకాయిలు తక్కువగా ఉండటం వల్ల బ్యాంకులు గృహ రుణాల విభాగంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగానే ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ తదితర బ్యాంకులు హోమ్‌లోన్‌సపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. మహిళలకు అదనంగా 0.05 శాతం తక్కువకే రుణం అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులైతే ప్రతి రూ.లక్షకు ఈఎంఐ అతి తక్కువగా రూ.812-815 స్థాయిలో ఉండేట్టుగా (30 ఏళ్ల వ్యవధికి రూ.75 లక్షల దాకా రుణంపై)రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ లెక్కన ఏడాదిన్నర కిందట ఉన్న 10.15 శాతం వడ్డీ రేటుతో పోలిస్తే రూ.50 లక్షల రుణం తీసుకునే కొత్త కస్టమర్లకు నెలకు సుమారు రూ.3,300 వరకూ ఆదా అవుతున్నట్టే.
ఎంసీఎల్‌ఆర్... స్ప్రెడ్ రెండూ చూడాలి!
గృహ రుణం తీసుకునేటపుడు బ్యాంకుల ఎంసీఎల్‌ఆర్‌ను, స్ప్రెడ్‌ను చూడాలి. ఎంసీఎల్‌ఆర్ ఆంటే.. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్‌స బేస్డ్ లెండింగ్ రేటు. గతంలో బ్యాంకులు బేస్ రేటు ప్రాతిపదికన వడ్డీ రేటును నిర్ణయించేవి. అయితే పాలసీ రేట్లను తాను తగ్గించినా బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించకపోవటంతో... ఆర్‌బీఐ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచీ ఎంసీఎల్‌ఆర్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో రెపో రేటు మారిన ప్రతిసారీ ఎంసీఎల్‌ఆర్ కూడా మారుతుంది. రుణగ్రహీతలకు ఆ ఫలితాలు సత్వరం బదిలీ అవుతాయి. బేస్ రేటు ప్రాతిపదికన అధిక వడ్డీకి రుణాలు తీసుకున్న వారు కావాలనుకుంటే తమ బ్యాంకులో గానీ లేదా ఇతర బ్యాంకులో గానీ తక్కువ ఎంసీఎల్‌ఆర్ విధానానికి మార్చుకునే వెసులుబాటుంది. దీనివల్ల కొంత ఆదా అవుతుంది. అరుుతే, ఇందుకు ఆయా బ్యాంకులు కొంత చార్జీలు కూడా విధించవచ్చు. అంటే దాదాపు 10.15 శాతం వడ్డీ రేటుపై రుణం తీసుకున్న వారు కొంత చార్జీలను కట్టి 9.15 శాతం వడ్డీ రేటుకి మారే వీలుంది.
తక్కువ ఎంసీఎల్‌ఆర్ ఉన్న బ్యాంకును ఎంచుకుంటే సరిపోదు. ఎందుకంటే.. బ్యాంకులు తమ ప్రామాణిక రేటుకి కొంత మార్జిన్ జోడించి రుణ రేటును నిర్ణయిస్తాయి. దీన్ని స్ప్రెడ్‌గా పిలుస్తారు. ఉదాహరణకు ఎస్‌బీఐ 8.95 శాతం ఉన్న ఎంసీఎల్‌ఆర్‌పై 0.20-0.25 శాతం జోడించి మిగతా పోటీ బ్యాంకుల కన్నా కూడా తక్కువకే.. 9.10-9.15 శాతం వడ్డీకి రుణాలిస్తోంది. పోటీ బ్యాంకులతో పోలిస్తే తేడా కొంచమే అనిపించినా.. దీర్ఘకాలంలో ఇది భారీ మొత్తమే అవుతుంది. ఉదాహరణకు .. ఇటీవల తగ్గించిన రేట్ల ప్రకారం దాదాపు రూ.50 లక్షల రుణంపై నెలకు రూ.542 చొప్పున... 30 ఏళ్ల వ్యవధిలో ఏకంగా రూ.2 లక్షల దాకా ఆదా చేసుకోవచ్చని ఊరిస్తోంది ఎస్‌బీఐ. దీన్నే రికరింగ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేస్తే లోన్ వ్యవధి పూర్తయ్యేసరికి రూ.6 లక్షలు జమవుతాయంటోంది. అందుకని ఎంసీఎల్‌ఆర్‌తో పాటు స్ప్రెడ్‌ను కూడా చూడాలి.
బ్యాంకు వడ్డీ (%)నుంచి
ఎస్‌బీఐ 9.15
పీఎన్‌బీ 9.3
ఐసీఐసీఐ 9.2
హెచ్‌డీఎఫ్‌సీ 9.2
యాక్సిస్ 9.45
ఫ్లోటింగ్ ప్రాతిపదికన
ఉద్యోగులకు గృహ రుణాలిచ్చే రేటు
15 ఏళ్ల వ్యవధికి 15 బేసిస్ పాయింట్లు (0.15 శాతం) తగ్గిస్తే వచ్చే లాభమిదీ...
రుణ మొత్తం 9.3% 9.15% నెలవారీ మొత్తం మీద
(రూ.) ఈఎంఐ ఈఎంఐ ఆదా (రూ.) ఆదా (రూ.)
25 లక్షలు 25,805 25,580 225 40,415
50 లక్షలు 51,610 51,160 450 80,830
75 లక్షలు 77,414 76,741 673 1,21,246