
భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ టెలీకాన్ఫరెన్స్
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. చైనా పర్యటనలో ఉన్న ఆయన.. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఎక్సైజ్ మంత్రి పద్మారావు, వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్ మాట్లాడుతూ.. నగరంలో కురుస్తున్న వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు 86 అత్యవసర బృందాలను నియమించినట్లు తెలిపారు. 24 గంటలూ పనిచే సే ఈ బృందాల నిర్వహణకు రూ. 12.83 కోట్లు కేటాయించామన్నారు. 227 ప్రాంతాల్లో భారీగా నిలిచిన నీటిని తొలగించామన్నారు.
కాల్ చేస్తే కదిలొస్తాం: మహమూద్ అలీ
భారీ వర్షాల కారణంగా జంట నగరాల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఆపద సమయంలో ఎవరైనా కాల్ చేస్తే వెంటనే కదిలి వచ్చేందుకు అధికారులతో పాటు మంత్రులు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నగరంలో రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం నగర మంత్రులతో కలసి డిప్యూటీ సీఎం రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్షించారు.
అనంతరం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. వర్షాల వల్ల ఎవరైనా ఆపదలో చిక్కుకుంటే సాయం కోసం కంట్రోల్‌రూమ్ నంబర్ల(040-23394566, 9000113667)కు ఫోన్ చేయవచ్చన్నారు. ఈ కంట్రోల్ రూమ్ లో 24 గంటలూ ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత అధికారులకు సమాచారం అం దించేలా సిబ్బందిని నియమించామన్నారు. చైనా పర్యటనలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో భారీ వర్షాల గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్.. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రులను ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం చెప్పారు.