
నరకం నుంచి అమ్మ ఒడికి!
12 ఏళ్ల ఆ చిన్నారికి సొంత బంధువులే నరకం చూపించారు. శరీరం నిండా గాయాలే.
మదురై: 12 ఏళ్ల ఆ చిన్నారికి సొంత బంధువులే నరకం చూపించారు. శరీరం నిండా గాయాలే. ఆ చిన్నారి బాధను చూడలేక పొరుగువారు జిల్లా బాలల సంక్షేమ కమిటీకి ఫిర్యాదు చేశారు. అలా ప్రభుత్వ అనాథ ఆశ్రయంలో చేరిన ఆ చిన్నారి ఎట్టకేలకు తల్లి ఒడికి చేరేలా మద్రాస్ హైకోర్టు చొరవ చూపింది. తన ఉత్తర్వుల ద్వారా తల్లీబిడ్డలను కలిపింది.
బాధిత బాలిక తల్లి ఒక వితంతువు. ఆమె ఇటీవల రెండో పెళ్లి చేసుకోవడంతో భర్త తరఫు బంధువైన రాకినాయి అనే మహిళ బాలికను తన ఆశ్రయంలోకి తీసుకుంది. అయితే, రాకినాయి, ఆమె కూతురు శరణ్య నిత్యం బాలికను శారీరకంగా హింసించి కొట్టేవారు. ఈ విషయమై పొరుగువారి ఫిర్యాదు ఆధారంగా తంజావూరు బాలల సంక్షేమ కమిటీ రంగంలోకి దిగి.. శరీరం నిండా గాయాలతో అల్లాడుతున్న బాలికను ప్రభుత్వ అనాథ ఆశ్రయానికి తరలించింది.
మరోవైపు తన బిడ్డ తనతోపాటు ఉండి పాపనాశనంలో చదువుకోవడానికి వీలుగా టీసీ ఇప్పించాలని రాకినాయిని తల్లిని కోరింది. ఆమె నిరాకరించడంతో ఆమె మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస ఎం సత్యనారాయణ, జస్టిస్ వీఎం వెలుమణితో కూడిన మధురై ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించి.. తల్లికి బిడ్డను అప్పగించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా ఆమె బిడ్డ చదువుకోవడానికి టీసీ కూడా ఇప్పించాల్సిందిగా ఆదేశించింది. మరోవైపు బాలికను కూర్రంగా హింసించిన రాకినాయి, ఆమె కూతురు శరణ్యపై పోలీసులు పలు అభియోగాల కింద నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.