
ఆ జర్నలిస్టు హిందూ అని తెలియడంతో...
సాక్షాత్తూ పాకిస్థాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే న్యూస్ ఏజెన్సీలో ఓ హిందూ జర్నలిస్టు అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నాడు.
కరాచీ: సాక్షాత్తూ పాకిస్థాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే న్యూస్ ఏజెన్సీలో ఓ హిందూ జర్నలిస్టు అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నాడు. అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ పాకిస్థాన్ (పీపీపీ) వార్తాసంస్థలో సీనియర్ రిపోర్టర్‌గా సాహిబ్ ఖాన్ ఓడ్ పనిచేస్తున్నారు. అయితే, ఇటీవల ఆయన హిందూ మతానికి చెందిన వారని తెలియడంతో ఆయన పట్ల ముస్లిం సహోద్యోగులు వివక్ష చూపడం మొదలుపెట్టారు. తాము వాడుతున్న తాగునీటి గ్లాసును, ఇతర పాత్రలను ఆయన తాకకుండా అంటరానితనాన్ని పాటిస్తున్నారు. దాదు జిల్లాకు చెందిన ఓడ్‌ను ఇస్లామాబాద్‌లో ఏపీపీ రిపోర్టర్‌గా నియమించారు. ఆ వెంటనే హైదరాబాద్‌కు బదిలీ చేశారు. గత ఏప్రిల్‌లో మరోసారి బదిలీపై కరాచీ పంపించారు.
సాహిబ్ ఓడ్ కొడుకు రాజ్‌కుమార్ ఓసారి వార్తాసంస్థ కార్యాలయానికి రావడంతో ఆయన హిందువు అన్న విషయం మిగతా ఉద్యోగులకు తెలిసిపోయింది. అప్పటినుంచి ఆయనపై రకరకాలుగా వివక్ష చూపుతున్నారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యున్ పత్రిక తెలిపింది. తన పేరులో ఖాన్ అని ఉండటంతో మొదట తాను ముస్లిం అని సహోద్యుగులు భావించి స్నేహంగా మెదిలారని, తాను హిందువు అని తేలడంతో పరిస్థితి మారిపోయిందని ఆయన తెలిపారు.
అందరూ తాగే గ్లాసును, ఇతర పాత్రలను వాడొద్దని బ్యూరో చీఫ్ తనకు చెప్పారని, ఇప్పుడు రంజాన్ మాసం కావడంతో ఇఫ్తార్ విందు సందర్భంగా అందరితో కలిసి భోజనం చేయనివ్వడం లేదని, అంతేకాకుండా ఇంటినుంచి సొంతంగా గ్లాసు, ప్లేటు తెచ్చుకుంటేనే ఆఫీసులో భోజనం చేయనిస్తామని పై ఉద్యోగులు తేల్చిచెప్పారని, దీంతో గత్యంతరం లేక తానే గ్లాసు, ప్లేటు తెచ్చుకుంటున్నానని ఆయన తన దీనగాథను తెలిపారు. కాగా, సాహిబ్‌కు ఫ్లూ జ్వరం ఉండటం వల్లే ఆయనను సొంతంగా గ్లాసు, ప్లేటు తెచ్చుకోమని చెప్పామని, ఇందులో అంటరానితనం ఏమీ లేదంటూ కరాచీ బ్యూరో చీఫ్ పర్వేజ్ అస్లాం ఈ అంశాన్ని తోసిపుచ్చే ప్రయత్నం చేశారు.