
ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు కన్నుమూత!
ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత మార్టిన్ లండౌ కన్నుమూశారు. ఆయన వయస్సు 89 ఏళ్లు. లాస్ ఏంజిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన వృద్ధాప్య కారణాల వల్ల శనివారం తుదిశ్వాస విడిచారు. 1960లో ’మిషన్: ఇంపాజిబుల్’ టీవీ సిరీస్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన మార్టిన్ అనేక సినిమాల్లో, టీవీ సీరియళ్లలో నటించి ప్రేక్షకులను అలరించారు. ’ఎడ్‌వుడ్’ సినిమాలో బెలా లుగోసి పాత్రకుగాను ఆయనను ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు వరించింది.
1959లో దర్శక దిగ్గజం ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ దర్శకత్వంలో వచ్చిన ’నార్త్ బై నార్త్‌వెస్ట్’ సినిమాతో ఆరంగేట్రం చేసిన ఆయన.. ఎడ్‌వుడ్, క్రైమ్స్ అండ్ మిస్‌డిమీనర్స్ తదితర సినిమాలు, స్పేస్, మిషన్ ఇంపాజిబుల్ వంటి టీవీ సీరియళ్లతో అలరించారు. 1989లో వచ్చిన క్రైమ్స్ అండ్ మిస్‌డీనర్స్ చిత్రంలో అద్భుతమైన నటనతో మార్టిన్ ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆయన మృతి పట్లు పలువురు హాలీవుడ్ నటులు సంతాపం ప్రకటించారు.