తేనెటీగ విషంతో హెచ్‌ఐవీ ఖతం! | Honey-Bee Venom Kills HIV | Sakshi
Sakshi News home page

తేనెటీగ విషంతో హెచ్‌ఐవీ ఖతం!

Published Wed, Sep 18 2013 1:58 PM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM

తేనెటీగ విషంతో హెచ్‌ఐవీ ఖతం!

తేనెటీగ విషంతో హెచ్‌ఐవీ ఖతం!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను కబళిస్తున్న హెచ్‌ఐవీ మహమ్మారి నిర్మూలనకు ఉపయోగపడే శక్తిమంతమైన అస్త్రాలు మరో రెండేళ్లలో సిద్ధం కానున్నాయి.

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను కబళిస్తున్న హెచ్‌ఐవీ మహమ్మారి నిర్మూలనకు ఉపయోగపడే శక్తిమంతమైన అస్త్రాలు మరో రెండేళ్లలో సిద్ధం కానున్నాయి. అపార ఔషధగుణాలు గల ‘సమోవన్ మమాలా’ చెట్టు బెరడు, బ్రయోజోవా అనే సముద్రజీవుల నుంచి సేకరించిన రసాయనాలతో స్టాన్‌ఫర్డ్ వర్సిటీ  శాస్త్రవేత్తలు సమర్థమైన కొత్త మందులను తయారుచేశారు.

 సమోవన్ బెరడు నుంచి తయారుచేసిన ‘ప్రొస్ట్రాటిన్’ అనే ఔషధం.. మనిషి శరీర కణాల్లో దాక్కునే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియెన్సీ వైరస్ (హెచ్‌ఐవీ)ని బయటికి తరిమేస్తుందని వర్సిటీ శాస్త్రవేత్త పాల్ వెండర్ వెల్లడించారు. మంగళవారం ఇండియానాపొలిస్‌లో అమెరికన్ కెమికల్ సౌసైటీ 246వ సమావేశాల సందర్భంగా వెండర్ ఈ మేరకు ‘హెల్త్‌లైన్’తో మాట్లాడారు.


ప్రొస్ట్రాటిన్‌తో ఇప్పటిదాకా జంతువులు, ఎయిడ్స్ రోగుల రక్తంపై పరీక్షలు చేయగా, పూర్తి సత్ఫలితాలు వచ్చాయన్నారు. మనుషుల్లో దీన్ని ఉపయోగించడం కోసం అమెరికా ‘ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ)’ అనుమతి కూడా లభించిందని, రెండేళ్లలోనే అందుబాటులోకి తేనున్నామన్నారు.

 కణాల లోపలి నుంచి గెంటేస్తుంది..!
 సమోవన్ బెరడు నుంచి ప్రొస్ట్రాటిన్, బ్రయోజోవన్ల నుంచి ‘బ్రయోస్టాటిన్’ రసాయనాలను సేకరించి వైద్యపరమైన ఉపయోగం కోసం ప్రయోగశాలలో పునరుత్పత్తి చేశారు. ఎయిడ్స్ చికిత్సకు ఇప్పటిదాకా తయారుచేసిన ఔషధాలు హెచ్‌ఐవీ వైరస్‌లు కణాల బయట ఉన్నప్పుడే వాటిని నాశనం చేయగలుగుతున్నాయి. ఈ ఔషధాల వినియోగం ఆపేయగానే కణాల్లో దాక్కున్న హెచ్‌ఐవీ వైరస్‌లు బయటికి వచ్చి మళ్లీ విజృంభిస్తున్నాయి. అయితే కణాలలోపల దాగున్న వైరస్‌లను సైతం ప్రొస్ట్రాటిన్ బయటికి గెంటేయగలుగుతుందని వెండర్ వివరించారు.  

 పాతికేళ్ల క్రితమే గుర్తించినా...
 ఎయిడ్స్ కారక హెచ్‌ఐవీ వంటి వైరస్‌లను నిర్మూలించే గుణం సమోవన్ చెట్టు బెరడుకు ఉందని 1987లోనే కాక్స్ అనే శాస్త్రవేత్త గుర్తించారు. దీనిపై పరిశోధన చేపట్టిన పాల్ వెండర్ బృందం ఎట్టకేలకు ఔషధాన్ని తయారుచేయగలిగింది. అయితే ప్రకృతిసిద్ధమైన ప్రొస్ట్రాటిన్‌ను ప్రయోగశాలలో రకరకాల మార్పులకు గురిచేసిన తర్వాతే దానిని తాము వంద రెట్లు శక్తిమంతంగా మార్చగలిగామని వెండర్ పేర్కొన్నారు. బ్రయోజోవా నుంచి తీసిన బ్రయోస్టాటిన్‌ను కూడా వెయ్యిరెట్లు శక్తిమంతంగా తయారుచేశామని, హెచ్‌ఐవీని తరిమేయడంలో అది ప్రొస్ట్రాటిన్ కన్నా మేలైనదన్నారు.  

 కేన్సర్, అల్జీమర్స్ వ్యాధులకూ చికిత్స...
 మనిషి వేళ్ల మాదిరిగా ఉండే ‘బ్రయోజోవా’ నుంచి సేకరించిన బ్రయోస్టాటిన్ రసాయనం కేన్సర్, అల్జీమర్స్ వ్యాధుల చికిత్సకూ ఉపయోగపడనుందని వెండర్ చెబుతున్నారు. బ్రయోస్టాటిన్‌తో కొన్ని జంతువులకు చికిత్స చేయగా.. అవి విషయాలను  ఎక్కువకాలం గుర్తుంచుకోగలిగాయట. దీంతో మతిమరుపు, ఇతర లక్షణాలుండే అల్జీమర్స్ చికిత్సకూ దీనిని ఉపయోగించవచ్చని భావిస్తున్నారు.
 
 తేనెటీగ విషంతో హెచ్‌ఐవీ ఖతం!
 తేనెటీగ విషంలోని మెలిటిన్ పదార్థంతో హెచ్‌ఐవీ నిర్మూలనకు ఔషధాన్ని తయారుచేస్తున్నట్లు ‘వాషింగ్టన్ యూనివర్సిటీ’ శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు. హెచ్‌ఐవీ సోకకుండా నివారించే జెల్‌తోపాటు మందును కూడా మెలిటిన్‌తో తయారుచేయవచ్చట.

 ఎక్కువ మొత్తంలో ఉంటే శరీర కణాలకు హాని చేసే మెలిటిన్‌ను అత్యంత సూక్ష్మ పరిమాణంలోని నానోపార్టికల్స్ ద్వారా శరీరంలోకి ప్రవేశపెడితే.. హెచ్‌ఐవీ కణాలకు అతుక్కుని వాటి చుట్టూ ఉండే రక్షణ కవచాలకు తూట్లు పొడుస్తుందట. ఇంకేం.. రక్షణ కవచాన్ని తిరిగి ఉత్పత్తి చేసుకోలేక హెచ్‌ఐవీ  అంతమైపోతుందన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement