
ప్రేమ పెళ్లి చిచ్చు: అల్లుడు హతం
జైపూర్: తమ కుమార్తె వేరే కులస్తుడిని పెళ్లి చేసుకుని పరువు తీసిందని ఆ తల్లిదండ్రులు కోపం పెంచుకున్నారు. వేరే కులం వ్యక్తిని అల్లుడిగా అంగీకరించలేక అతడిని చంపేశారు. రాజస్థాన్‌లో ఈ దురాగతం చోటు చేసుకుంది. జైపూర్ నగరానికి చెందిన జీవన్‌రాం చౌధరి, భగ్‌వానీ ఛౌధరి దంపతుల కుమార్తె మమత వేరే కులానికి చెందిన అమిత్ నాయర్ అనే సివిల్ ఇంజినీర్‌ను ప్రేమించింది. పెద్దలకు ఇష్టం లేకున్నా వారిద్దరూ పెళ్లి చేసుకుని నగరంలోని జగదాంబ విహార్ కాలనీలో కాపురం పెట్టారు. ఇది జరిగి రెండేళ్లవుతోంది.
అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో మమత గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న జీవన్‌రాం చౌధరి, తన భార్య మరో ఇద్దరిని తీసుకుని బుధవారం కుమార్తె ఇంటికి వెళ్లాడు. ఇంట్లోనే ఉన్న అమిత్‌ను వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చగా అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం ఆ నలుగురు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న కర్ణివిహార్ పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మమత ఫిర్యాదు మేరకు నిందితులపై కేసులు నమోదు చేసి, గాలింపు చేపట్టారు.