వేతన పెంపు జాప్యానికి కారణం ఇదేనా?
ఏడవ వేతన సంఘ సిఫారసులకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపి దాదాపు ఆరు నెలల కావొస్తోంది. అయినా వేతన పెంపు శుభవార్త కోసం ఇంకా ప్రభుత్వోద్యోగులు వేచిచూస్తునే ఉన్నారు. ఆమోదం పొందినా ఈ సిఫారసులు అమలుకు నోచుకోవడం లేదు. దీనికి గల ప్రధాన కారణం పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడిన నగదు కొరతేనని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. గత జనవరి 1 నుంచే ఉద్యోగులకు ఏడవ వేతన కమిషన్ ప్రతిపాదనలను అమలుచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న అనంతరం పరిస్థితంతా తలకిందులైంది. అప్పటినుంచి ప్రభుత్వం వేతన పెంపును ఎప్పుడు చేపడుతుందో క్లారిటీగా వెల్లడించడం లేదు.
ఏడవ వేతన సంఘ ప్రకారం హౌసింగ్ అలవెన్స్ కింద 138.71 శాతం, ఇతర అలవెన్స్ కింద 49.79 శాతం ఉద్యోగులకు పెంచాల్సి ఉంది. ఈ అలవెన్స్ ప్రతిపాదనల అమలుతో ప్రభుత్వం దాదాపు రూ.29,300 కోట్ల మేర భారాన్ని భరించాల్సి ఉంది. ఇప్పటికే డీమానిటైజేషన్ ఎఫెక్ట్తో నగదు కొరతను ప్రభుత్వం ఎదుర్కొంటుండటంతో, ఈ వేతనాలను పెంచి మరింత నగదు కొరత భారాన్ని భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. త్వరగా తమకు అలవెన్స్ పెంపును చేపట్టాలని ఉద్యోగుల సంఘాలు తెచ్చిన ఒత్తిడి మేరకు, వేతనసంఘ సిఫారసులకు ఆమోదం తెలిపినప్పటికీ, అమలును మాత్రం చేపట్టడం లేదు.
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ మధ్యలో అలవెన్స్ పెంపు చేపట్టడానికి ప్రభుత్వానికి అనుమతి ఉండదు. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లో ఉన్నంత కాలం ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేయాల్సి ఉంటుంది. ఈ లోపల నగదు చలామణి కూడా పెరిగి, వేతన పెంపుకు ప్రభుత్వానికి కొంత ఉపశమనం దొరుకుతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కానీ ఈ జాప్యం ఉద్యోగుల్లో మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోందని రిపోర్టులు చెబుతున్నాయి.