2 వేల నోటు.. ఓ పజిల్ | How scrapping 500, 1000 notes and bringing in 2000 notes will check black money: Congress | Sakshi
Sakshi News home page

2 వేల నోటు.. ఓ పజిల్

Published Thu, Nov 10 2016 9:22 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

2 వేల నోటు.. ఓ పజిల్ - Sakshi

2 వేల నోటు.. ఓ పజిల్

న్యూఢిల్లీ: రూ.500/ 1000 నోట్ల రద్దును కాంగ్రెస్ మరోసారి తప్పుబట్టింది. నల్లధనాన్ని తుడిచిపెట్టేందుకే పెద్ద నోట్లను రద్దు చేసి ఉంటే.. రూ.2వేల నోటును తీసుకురాడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించింది. ఇదొక అంతుపట్టని పజిల్‌లా ఉందని దుయ్యబట్టింది. నోట్ల మార్పిడిలో సామాన్యులు ఇబ్బందులను ఎదుర్కొంటే అది వారిని వేధింపులకు గురిచేసినట్లే అవుతుందని మండిపడింది.

ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ, ‘గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా ఇలాంటి ఆలోచన చేసింది. అయితే, దీనివల్ల చేకూరే ఆర్థిక ప్రయోజనాలు మరీ అంత భారీగా ఉండకపోవడంతో ఈ ఆలోచనను విరమించుకుంది’ అని చెప్పారు. పెద్ద నోట్లను రద్దు చేసి, మళ్లీ అంతకంటే ఎక్కువ విలువున్న కొత్త నోటును తీసుకొస్తే లక్ష్యం ఎలా నెరవేరుతుందని నిలదీశారు.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, రైతులు, చిన్న వ్యాపారులు, గృహిణులంటే మోదీకి ఎంత చిన్నచూపో అన్న విషయం మరోసారి అవగతమవుతోందన్నారు. ‘అసలు దొంగలు విదేశాల్లో/ బులియన్ మార్కెట్‌లో నల్లధనం పెట్టి  ధీమాగా కూర్చొని ఉన్నారు. వెల్‌డన్ మోదీ’ అని ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ప్రధానికి ఒక ప్రశ్న. రూ. వెరుు్య నోటును మరింత నల్లధనాన్ని పెంచే రూ.2వేల నోటుతో భర్తీ చేస్తున్నారా’ అని దుయ్యబట్టారు.  
 
ఆకస్మిక నిర్ణయం కాదు
ప్రధాని తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైంది. విప్లవాత్మకమైంది. దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరించడానికి, నల్ల ధనాన్ని అరికట్టడానికి, అవినీతికి కళ్లెం వేయడానికి తీసుకున్న ఈ చర్యకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నారుు. ఇదేదో ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదు. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే ఆర్థిక వ్యవస్థను సంస్కరించే చర్యలు ప్రారంభమయ్యారుు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే చిత్తశుద్ధితోపాటు.. నాయకత్వానికి దూరదృష్టి ఉండాలి.
 -కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు
 
చరిత్రాత్మక నిర్ణయం
మోదీ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనది. నల్లధనం దాచుకున్న వారికి, అవినీతి పరులు, నకిలీ నోట్లు సరఫరా చేస్తున్న ఆర్థిక ఉగ్రవాదులకు ఇదొక సర్జికల్ స్ట్రైక్. పన్నులు ఎగ్గొట్టి రూ.కోట్లు కూడబెట్టిన వారికి ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు అవకాశం ఇచ్చింది. అయినా ఆదాయం వెల్లడించని వారికి ఈ చర్య పిడుగుపాటే.
 -బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్
 
 ప్రజల దృష్టి మళ్లించేందుకే

 విదేశాల్లోని నల్లడబ్బును వెనక్కి రప్పించడంలో విఫలమైన కేంద్రం, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు నాటకీయ నిర్ణయం తీసుకుంది. కేంద్రం వెంటనే స్పందించి సామాన్యులకు తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించాలి. నల్లడబ్బు తరలింపుపై నిఘా పెట్టాలి.
 -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
 
ఎన్నికల్లో గెలిచేందుకే: న్యూడెమోక్రసీ
విదేశాల్లోని నల్లడబ్బును వెనక్కి రప్పించి ప్రతి ఒక్కరికి అందేలా చేస్తానని నరేంద్ర మోదీ చేసిన వాగ్దానాన్ని తీర్చలేక, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారని న్యూ డెమోక్రసీ (చంద్రన్న) ధ్వజమెత్తింది. పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయడం కాకుండా నల్లధనం రద్దుకు చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేత కె.గోవర్దన్ సూచించారు.

పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న చర్య నల్లధనాన్ని, నకిలీ నోట్లను నిరోధించడంలో ఒక ముందడుగే. అరుుతే మళ్లీ అవినీతి జరగకుండా ప్రజలకు సమర్థ పాలన అందించడానికి మాత్రం సరిపోదు. ఇది సంస్కరణలకు ఆరంభమే తప్ప అంతం కాదు. సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నల్లధనం ఖర్చుపెట్టి గెలిచినా ప్రధాని మోదీ సాహసోపేతంగా వ్యవహరించడం ఆహ్వానించదగ్గదే.
-లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జేపీ
 
చిన్న అంశమే
కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడం.. నల్లధనం వెలికితీసే ప్రక్రియలో చిన్న అంశమే.ఈ నిర్ణయంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నందున కేంద్రం వెంటనే తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలి.
 -సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు నాగయ్య
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement