
ఈజీగా లోన్ ఇక కష్టమే!
ఒకప్పుడు అప్పు కోసం చెప్పులరిగేదాకా తిరగాల్సి వచ్చేది. ఇప్పుడా అవసరంలేకుండా మొబైల్ యాప్స్ ద్వారా అవసరమైనప్పుడు సులభంగా, వేగంగా రుణం(లోన్) అందిస్తున్నాయి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లు. బ్యాక్ స్టేట్ మెంట్, పే స్లిప్, పాన్, ఆధార్ కార్డులాంటి చిన్నచిన్న వెరిఫికేషన్లతోనే రుణాలు అందించే ఆన్ లైన్ లెండర్(ఆన్ లైన్ ద్వారా అప్పిచ్చే) కంపెనీలు రోజురోజుకూ వృద్ధిచెందుతున్న సంగతి తెలిసిందే. ఇన్స్టా-పైసా, గో-పే సెన్స్, ఫెయిర్ సెంట్, క్యాష్ కేర్, వోట్ 4క్యాష్, ఈజీసాలరీ, బ్యాంక్ బజార్, క్రెడిట్ మంత్రి లాంటి డజనుకుపైగా ఆన్ లైన్ లెండర్స్ ఇప్పటికే కోట్లరూపాయల రుణాలను కస్టమర్లకు అందించాయ. అయితే ఇకముందు కూడా ఈజీగా లోన్ పొందాలంటే మాత్రం కొన్నికఠిన నిబంధనలు పాటించాలి. నిబంధనలంటే గ్యారంటీ చూపడమో మరొకటో కాదు.. జస్ట్ మన ప్రవర్తన కాపాడుకోవడం!
అవును. ఆన్ లైన్ క్రెడిట్ పొందాలంటే సోషల్ మీడియాలో మీ ప్రవర్తన బాగుండాలి. మీరు పెట్టే స్టేటస్ లు, రాసే కామెంట్లు, తిరిగే ప్రదేశాలు.. అన్నీ క్రమపద్ధతిలో ఉండాలి. ఏమాత్రం మోసపూరితంగానో, అక్రమంగానో ఉంటే లోన్ దక్కదు. కొన్నిసార్లు అధిక వడ్డీ తప్పదు! ఈ మేరకు కస్టమర్ల సోషల్ మీడియా బిహేవియర్ ను సమగ్రంగా పరిశీలించేందుకు ఆయా ఆన్ లైన్ లెండర్స్ ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసుకున్నాయి. లోన్ అప్లై చేసిన కస్టమర్ల అనుమతితో వాళ్ల ఫేస్ బుక్, ట్విట్టర్, మెయిల్స్ ను ఆర్టిఫిషియల్స్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా తనిఖేచేస్తామని, 'ఆల్ ఈజ్ వెల్' అనుకుంటే తప్ప లోన్ ఇవ్వబోమని ఇన్స్టా-పైసా సీఈవో నిఖిల్ సామా తెలిపారు.
కస్టమర్లు డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ రూల్స్ వాయిలేషన్స్ కు పాల్పడ్డారా లేదా అనేది కూడా తాము కనిపెట్టగలమని, ఇంతకుముందు ఏదైనా యాప్ లేదా సాధారణ బ్యాంక్ నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టిన విషయాన్ని కూడా పసిగట్టగలమని ఇన్స్టా పైసా, క్యాష్-ఈ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. కస్టమర్ ఎలాంటివాడో పరిశీలించిన తర్వాతే రుణం మంజూరుచేస్తామని, అయితే ఇదంతా గంటల వ్యవధిలోనే పూర్తిచేస్తామని పేర్కొన్నారు.
నమ్మకం- రుణం విడదీయరానివని, అందుకే నమ్మదగిన కస్టమర్లకు మాత్రమే రుణం అందిస్తామని ఈజీసాలరీ డాట్ కామ్ సహవ్యవస్థాపకుడు అక్షయ్ మెహ్రోత్రా తెలిపారు. ఏఐ ద్వారా సేకరించే సమాచారాన్ని మూడో వ్యక్తితో పంచుకోమని, కస్టమర్ల వ్యక్తిగత మెయిల్స్, మెసేజెస్ జోలికి పోబోమని, వ్యవహారాలన్నీ పూర్తిపారదర్శకంగా ఉంటాయని ఆన్ లైన్ రుణదాతలు అంటున్నారు. ఇదంతా చదివాక 'ఈజీగా లోన్ తీసుకోవడం కష్టమే!' అని అనుకుంటున్నారా? 'అవసరానికి అప్పు కావాలంటే తప్పదుకదా!' అని నిట్టూరుస్తున్నారా?