మగవాళ్లు, మహిళల చెల్లింపుల్లో మరీ ఇంత తేడానా?
లండన్: ప్రపంచ క్రీడారంగంలో అత్యంత ఎక్కువ సంపాదన కలిగిన వ్యక్తి ప్రముఖ అథ్లెట్ క్రిస్టినో రొనాల్డో కాగా, మహిళల్లో ఫుట్‌బాల్ ప్లేయర్ అలెక్స్ మోర్గాన్. ఎండార్స్‌మెంట్లు, స్పాన్సర్‌షిప్‌లు, క్రీడారంగం చెల్లింపుల ద్వారా రొనాల్డో ఆదాయం ఏడాదికి 880 లక్షల డాలర్లు కాగా, అలెక్స్ మోర్గాన్‌కు వచ్చేది ఏడాదికి కేవలం 28 లక్షల డాలర్లు మాత్రమే. క్రీడారంగంలో మహిళలు, మగవాళ్ల మధ్య ఆర్థిక వ్యత్యాసం ఎంతో ఉందనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
14,500 కోట్ల డాలర్ల విలువైన ప్రపంచ క్రీడారంగం నిర్వహణలో మగవాళ్ల ఆధిపత్యం కొనసాగడం ఇందుకు ముఖ్యకారణంకాగా, క్రీడారంగంలో ప్రైవేటు భాగస్వామ్యం, మహిళా క్రీడల పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి తక్కువగా ఉండడం ఇతర కారణాలని యుకే, ఆస్ట్రేలియాకు చెందిన ‘విమెన్ ఆన్ బోర్డ్స్’ అనే గ్రూప్ ఓ నివేదికలో వెల్లడించింది. ప్రధానంగా బాస్కెట్‌బాల్, క్రెకెట్, గోల్ఫ్, ఫుట్‌బాల్ క్రీడల్లో చెల్లింపుల మధ్య మహిళలు, మగవారి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉందని ఆ నివేదిక తెలిపింది.
ప్రపంచ కప్ ప్రైజ్ మనీ విషయంలో కూడా ఇద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం కొనసాగుతోంది. 2014లో జరిగిన ఫిఫా మెన్స్ వరల్డ్‌కప్‌కు ప్రైజ్ మనీని 57.60 కోట్ల డాలర్లుగా నిర్ణయించగా, అదే 2015లో జరిగిన ఫిఫా విమెన్స్ వరల్డ్‌కప్ ప్రైజ్ మనీని 1.50 కోట్ల డాలర్లుగా నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడల నిర్వహణ బోర్డు లేదా సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం బాగా తక్కువగా ఉండడం, మగవాళ్ల ఆదిపత్యం ఎక్కువగా ఉండడమే ప్రధాన కారణమని నివేదిక అభిప్రాయపడింది.
రియో డీ జెనీరోలో జరిగిన ఇటీవలి ఒలింపిక్స్‌కు ముందున్న లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ గవర్నింగ్ బాడీల్లో మహిళల ప్రాతినిధ్యం 30 శాతంకన్నా తక్కువగా ఉంది. ‘ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు’లో మొత్తం 15 మంది సభ్యులుండగా నలుగురు మహిళలు ఉన్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డు చరిత్రలోనే మొదటిసారిగా 2013లో నలుగురు మహిళలను తీసుకోగా, మూడేళ్లు గడిచినా వారి సంఖ్య పెరగలేదు.
ప్రపంచవ్యాప్తంగా 28 అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల్లో 18 శాతం మాత్రమే మహిళలు ఉండగా, 129 జాతీయ ఒలింపిక్ కమీటీల్లో 16.6 శాతం మహిళలు మాత్రమే ఉన్నారు. కనీసం వీటిల్లో 20 శాతం మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలని 2005లోనే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్దేశించింది. మాలవి, ఆస్ట్రేలియా, బెర్ముడా, నార్వే, న్యూజిలాండ్, కిరిబతి, సమోవా, టువాలు దేశాల ఒలింపిక్ బోర్డులు, కమిటీల్లో 40 శాతం కన్నా ఎక్కువగా మహిళలు ఉన్నారు.
ఆ తర్వాత అమెరికాలో 31.3 శాతం, బ్రిటన్‌లో 26.7 శాతం మహిళలు ఉన్నారు. ఒక్క టెన్నీస్ క్రీడా కమిటీల్లోనే మహిళ భాగస్వామ్యం 2014 నుంచి పెరుగుతూ వస్తోంది. ప్రపంచ క్రీడారంగంలో మహిళలు, మగవాళ్ల మధ్యనున్న ఆర్థిక చెల్లింపుల వ్యత్యాసం, క మిటీల ప్రాతినిథ్యంలోవున్న వ్యత్యాసాన్ని ఓ పద్ధతి ప్రకారం తొలగించేందుకు కృషి చేయాలని కమిటీ ప్రపంచదేశాలకు ఆ నివేదికలో పిలుపునిచ్చింది.