తీరంలో అద్భుతం: మానవహారంగా ఏర్పడి..!
అమెరికా ఫ్లోరిడాలోని పనామా సిటీ బీచ్‌లో మానవత్వం పరిమళించే ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. కళ్లముందే ఓ కుటుంబం నీళ్లలో కొట్టుకుపోవడాన్ని చూసి అక్కడి వారంతా క్షణాల్లో స్పందించి ఆ కుటుంబాన్ని కాపాడారు. రాబెర్టా ఉర్స్ రే అనే మహిళ బోట్ రైడ్ చేస్తుండగా అది నీటిలో మునిపోయింది. అందులోని వారు నీటిలో కొట్టుకుపోతూ 'హెల్ప్ హెల్ప్' అంటూ అరిచారు. వారికి సాయం చేసేందుకు ఓ దంపతులు ముందుకొచ్చారు. వారిని కాపాడేందుకు ఈదుకుంటూ వెళ్లారు. వాళ్లని చూసి మరో ఇద్దరు, ఇంకో నలుగురు.. ఇలా దాదాపు 80 మంది నీటిలోకి వెళ్లారు. చేయిచేయి కలిపి మానవహారంలా మారి.. కుటుంబాన్ని రక్షించారు.
జులై 8న జరిగిందీ ఘటన. రాబెర్టా ఉర్స్‌రే అనే మహిళ తన కుటుంబంతో కలిసి బోట్ రైడ్ చేస్తుండగా.. బోట్ మునిగిపోయింది. నీటిలో కొట్టుకుపోతూ హెల్ప్ హెల్ప్ అంటూ అరుస్తున్న ఉర్స్‌రే కుటుంబాన్ని జెస్సికా, డెరెక్ సిమన్స్ అనే దంపతులు చూశారు. ఆ సమయంలో అక్కడ హెల్పింగ్ గార్డ్స్ గానీ.. పోలీసులు గానీ లేరు. దీంతో క్షణం ఆలస్యం చేయకుండా జెస్సికా నీళ్లలోకి దూకింది. జెస్సికాకు ఈత బాగా వచ్చు. అనంతరం డెరెక్ కూడా ఆమె వెంట వెళ్లాడు. ఇంతలో మరి కొందరు నీళ్లల్లో ఈదుకుంటూ అక్కడికి చేరారు. నా చేయి పట్టుకోండి అంటూ జెస్సికా వెనుక ఉన్నవారికి చెప్పింది. అలా ఒక్కొక్కరుగా 80 మంది మానవహారంలా ఏర్పడ్డారు. నీటిలో కొట్టుకుపోతున్న వారిని గుర్తించడం ముందు కాస్త కష్టమైంది. అయితే వారి అరుపులు.. నీటిలో మునిగిపోతుండగా వారి తలలను గుర్తించి జెస్సికా ఆ దిశగా ఈత ప్రారంభించింది.
ఆమెను అనుసరించి మిగతా వాళ్లంతా చేయిచేయి పట్టుకుని ఈదుతూ వచ్చారు. అలా గంట పాటు శ్రమించి.. మొత్తం 10 మందిని రక్షించి.. తీరానికి తీసుకొచ్చారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో 67 ఏళ్ల మహిళ కూడా ఉంది. నీటిలో మునగడంతో ఆమె గుండెపోటుకు గురయ్యారు. అయితే ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఉర్స్‌రే మీడియాతో మాట్లాడుతూ.. జెస్సికానే లేకపోతే ఈ రోజు తామంతా బతికే వాళ్లం కాదని.. వారికి రుణపడి జీవితాంతం ఉంటామని చెప్పారు. ఎవరితో ఎవరికీ పరిచయం లేకపోయినా.. వారంతా ఒక్కటై తమను రక్షించారని చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.