ఆ మహిళా జర్నలిస్టుపై వేటు
శరణార్థుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన హంగేరీ మహిళా వీడియో జర్నలిస్టు పెట్రా లాజ్లోపై వేటు పడింది. ఆమెపై కోర్టు మూడేళ్ల ప్రొబెషన్ బాన్ విధించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన జెజెడ్ పట్టణ న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. శరణార్థుల పట్ల పెట్రా లాజ్లో ఉద్దేశపూర్వకంగా అవమానవీయంగా ప్రవర్తించిందని కోర్టు తేల్చింది. వీడియో లింకు ద్వారా ఆమె తన వాదనలను కోర్టుకు వినిపించారు. అయితే శరణార్థులపై పెట్రా లాజ్లో జాతివివక్షతో దాడి చేయాలని ఆమె తరపు న్యాయవాదులు వాదించారు.
సెర్బియా-హంగరీ సరిహద్దులోని రోజ్కే గ్రామంలో 2015, సెప్టెంబర్ లో శరణార్థుల పట్ల పెట్రా లాజ్లో ప్రవర్తించిన తీరు లోకానికి వెల్లడికావడంతో ఆమె తీవ్ర విమర్శలకు గురయ్యారు. మధ్యదరా సముద్రాన్ని దాటి సెర్బియా గుండా హంగరీలోకి ప్రవేశించిన శరణార్థులకు కాళ్లు అడ్డంపెట్టి పడేసింది. వీరిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. శరణార్థులను హింసించిన దృశ్యాలు బయటకు రావడంతో ఎన్1 టీవీ యాజమాన్యం ఆమెను డిస్మిస్ చేసింది. ఉద్యోగ బాధ్యతలు వదిలిపెట్టి జాత్యంహకారంతో ప్రవర్తించినందుకు ఆమె కోర్టు విచారణ ఎదుర్కొవాల్సి వచ్చింది. కోర్టు తీర్పును అప్పీలు చేస్తానని పెట్రా లాజ్లో తెలిపింది.