కస్టమర్‌ను చితక్కొట్టిన బౌన్సర్లు
న్యూఢిల్లీ: పబ్‌కు వచ్చిన ఓ కస్టమర్‌ను వెంటాడి మరీ చితక్కొట్టిన వైనం ఢిల్లీని గుర్గావ్‌లో చోటుచేసుకుంది. బౌన్సర్ల సాయంతో వినియోగదారుడిపై యాజమాన్యం వాళ్లే దాడికి దిగి తీవ్రంగా గాయపర్చిన వీడియో ఒకటి నెట్‌లో హల్ చల్ చేస్తోంది. దాదాపు గంట పాటు కొనసాగిన ఈ అమానుషం హాట్ టాపిక్ గా మారింది.
మార్చి 17వ తేదీ రాత్రి ఇయాన్ పబ్‌కి వెళ్లిన రాకీ (24) డ్యాన్స్ చేస్తున్న క్రమంలో తూలి పక్కనే ఉన్న బౌన్సర్లపై పడ్డాడు. అంతే అగ్రహానికి గురైన బౌన్సర్లు రాకీపై పంచ్‌లతో విరుచుకుపడ్డారు. ఆరుగురు వ్యక్తులు అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. దెబ్బలకు తాళలేక కిందపడిపోయినా వాళ్ల అరాచకం ఆగలేదు. విచక్షణరహితంగా దాడిచేశారు. పారిపోవడానికి ప్రయత్నించిన రాకీని కొంత దూరం పాటు వెంటాడి మరీ దాడి కొనసాగించారు. షాపింగ్ మాల్ ఆవరణలో 50 నిమిషాల పాటు కొనసాగిన వారి ఆగడాలు సీసీ టీవీ ఫుటేజిలో రికార్డయ్యాయి.
ఈ సంఘటనపై రాకీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని సమాచారం. అయితే పబ్ యాజమాన్యం వాదన మరోలా ఉంది. రాకీ, అతని స్నేహితులు మద్యం సేవించి అమర్యాదకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తోంది.