సొంత భార్యనే కామాటిపురలోని వేశ్యాగృహానికి అమ్మబోయిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు.
సాక్షి, ముంబై: సొంత భార్యనే కామాటిపురలోని వేశ్యాగృహానికి అమ్మబోయిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని తెలిపి ఆ మహిళను రక్షించింది అక్కడి వేశ్యావృత్తిలో మగ్గుతున్నవారేనని నాగ్‌పాడా పోలీసులు తెలిపారు. ఆమెకు రెండు నెలల పాప కూడా ఉందన్నారు. సలావుద్దీన్‌తోపాటు అతని మొదటి భార్యకు కూడా ప్రమేయం ఉండడంతో ఇద్దరినీ బుధవారం సాయంత్రం అరెస్టు చేశామన్నారు. నాగ్‌పాడాకు చెందిన ఓ మహిళను ఆమె భర్త సలావుద్దీన్ ఖాన్ కామాటిపురలోని వేశ్యాగృహానికి రూ. 40 వేలకు విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. సలావుద్దీన్ మొదటి భార్య ఆస్మా ఖాన్ ప్రమేయంతోనే ఆమెను వేశ్యగృహాలకు అమ్మబోయాడు. అతని భార్యనే ఇలా విక్రయిస్తున్నారని తెలుసుకున్న వేశ్యాగృహానికి చెందిన కొందరు రూ.20 వేలు ముందుగా ఇస్తామని పేర్కొని అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సలావుద్దీన్‌తోపాటు అతని మొదటి భార్య ఆస్మాను అరెస్టు చేశారు.