హైదరాబాద్ రియల్టీ
సాక్షి, హైదరాబాద్: రాజకీయ అనిశ్చితి, మార్కెట్ ఒడిదుడుకులు, రుణాల మంజూరు విషయంలో కనికరించని బ్యాంకులు, ఆశించిన స్థాయిలో పెరగని వేతనాలు, భారీగా పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలతో 2013లో హైదరాబాద్ నిర్మాణ రంగం దారుణంగా పడిపోయింది. ఏడాది ప్రారంభంలో అమ్మకాలతో కాస్త పర్వాలేదనుకున్న స్థిరాస్తి వ్యాపారం ఆరేడు నెలల నుంచి పీకల్లోతు కష్టాల్లో పడింది. మందగమనం అయినా సరే మొక్కవోని పట్టుదలతో పలు సంస్థలు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించి కొనుగోలుదారులకు నమ్మకాన్ని కల్గించాయి. మొత్తం మీద 2013లో బేజారైన హైదరాబాద్ రియల్టీ 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఊపందుకుంటుందని బిల్డర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
2013 ప్రారంభంలో చాలా మంది బిల్డర్లు, డెవలపర్లు అధిక విస్తీర్ణం గల ఫ్లాట్లకు శ్రీకారం చుట్టారు. ఆర్థికమాంద్యం, రాజకీయ అనిశ్చితి కారణంగా మార్కెట్ కుప్పకూలడంతో అటు నిర్మాణాల్ని చేపట్టలేక, ఇటు కట్టిన ఇళ్లను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. వంద ఫ్లాట్లు గల నిర్మాణంలో పది అమ్మినా ఇరవై అమ్మినా నిర్మాణం మొత్తం పూర్తిచేస్తేనే కొనుగోలుదారులకు అందివ్వగలరు. అందుకే అమ్మకాలతో సంబంధం లేకుండా 2013లో పలు నిర్మాణ సంస్థలు పనులను చేపట్టాయి. ఒకానొక దశలో ప్రాజెక్టుల్లో నుంచి ఎంత నష్టంతో బయటపడతాం అనే స్థాయికి బిల్డర్లు చేరుకున్నారు.
హైదరాబాద్‌లో ఇళ్లను కొనేవారిలో రెండు రకాలున్నారు. స్థానికులు, ఇతర ప్రాంతాలకు చెందినవారు. వీరి నిష్పత్తి 40:60 శాతంగా ఉంది. నిర్మాణం చివరి దశలో ఉన్నవాటిలో అమ్మకాలు పర్వాలేదు. అదే ఆరంభదశలో ఉన్న ప్రాజెక్టుల వైపు కొనుగోలుదారులు కన్నెత్తి కూడా చూడటం లేదు.
ఒక ప్రాంతంలో నివాస సముదాయాలకు గిరాకీ పెరగాలంటే ముందుగా ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. రోడ్లు, విద్యుత్తు, మంచినీరు వంటి సౌకర్యాలుండాలి. విద్యాలయాలు, ఆసుపత్రులు రావాలి. ఆ తర్వాత వినోద కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఏడాదికాలంగా నేర్చుకున్న పాఠాలతో ఏయే ప్రాంతాల్లో ఏయే తరహా నిర్మాణాల్ని ఆరంభించాలో బిల్డర్లకు మంచి అవగాహన ఏర్పడింది. ముఖ్యంగా అందుబాటులోకి వచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు, శరవేగంగా నిర్మాణం పనులు పూర్తి చేసుకుంటున్న మెట్రో రైల్ ప్రాజెక్టులతో చాలామందికి ఈ స్పష్టత వచ్చింది. బహుళ అంతస్తులు, ఆకాశహర్మ్యాలకు కేవలం మాదాపూర్, గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమయ్యాయి. గతంలో అనుమతులు తీసుకున్న సంస్థలే విడతల వారీగా నిర్మాణాల్ని చేపడుతున్నాయి. 2013లో పూర్తయిన ఫ్లాట్ల సంఖ్య తక్కువే అని చెప్పొచ్చు. అధికశాతం గృహప్రవేశం జరగడానికి 2014లోనే అవకాశముంది.
నాలుగేళ్ల క్రితం వరకు పెద్దగా అభివృద్ధి చెందని ఆదిభట్ల, బండ్లగూడ, పోచారం, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాలు 2013లో శరవేగంగా అభివృద్ధి చెందాయి. ఇందుకు కారణం ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్, ఐటీఐఆర్ ప్రాజెక్టులతో ఈ ప్రాంతాల్లో రియల్ వ్యాపారం జోరందుకుంది. ప్రత్యేకించి ఆదిభట్ల ప్రాంతాల్లో ముదుపుదారులు అధికదృష్టి సారిస్తున్నారు. ఇక్కడ టీసీఎస్ నలభై లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాల్ని చేపడుతోంది. 2014 ఫిబ్రవరికి ఇది పూర్తయ్యే అవకాశముంది. కాగ్నిజెంట్ పది లక్షల చదరపు అడుగుల్లో కట్టడాల్ని కడుతోంది. దీని కారణంగా ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థలాల ధరలకు అనూహ్యంగా రెక్కలొచ్చాయి.
2014 జాక్‌పాట్ ఇయర్..
వచ్చే రెండు మూడేళ్లలో మెట్రో రైల్, ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్)లు పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఆయా ప్రాజెక్టు పనులు కూడా శరవేగంగా జరుగుతుండటంతో రియల్టర్లలో కొత్త ఉత్సాహం మొదలైంది. ఐటీఐఆర్‌తో ఆదిభట్ల, వుహేశ్వరం, ఉప్పల్, పోచారం, గచ్చిబౌలి కారిడార్లలో అభివృద్ధి శరవేగంగా సాగుతోంది. ఆయూ ప్రాంతాల్లో రియుల్ వెంచర్లు, భారీ ప్రాజెక్టులు వెలుస్తున్నారుు. గతంలో ఫ్లాట్‌ను కొనుగోలు చేసేముందు అక్కడి మౌలిక వసతుల గురించి చెప్పే బిల్డర్లు నేడు ఆ పరిస్థితిని దాటిపోయారు. మెట్రో, ఓఆర్‌ఆర్, ఐటీఐఆర్ ప్రాజెక్టుల భవిష్యత్తు చిత్రాన్ని చూపిస్తున్నారు. వీటి చుట్టూ ఐటీ సంస్థలు, అంతర్జాతీయు స్థారుు ఆసుపత్రులు, విద్యాలయాలు కూడా కొలువుదీరుతుండటంతో 2014 నిర్మాణ రంగానికి జాక్‌పాట్ ఇయర్ వంటిదనే చెప్పాలి.
ఎన్నికల తర్వాతే ఊపు..
2014 సార్వత్రిక ఎన్నికల తర్వాతే హైదరాబాద్‌లో రియల్ వ్యాపారం మళ్లీ పుంజుకుంటుంది. అప్పుడు ఇళ్ల రేట్లు 20-25 శాతం పెరుగుతాయి. కూకట్‌పల్లి-శంషాబాద్ ప్రాంతాల్లో ఏకంగా 40-60 శాతం రేట్లు పెరిగే అవకాశం ఉంది. చ.అ. ధర రూ.3,500లుగా ఉన్నది రూ. 5 వేలకు పైగానే పలుకుతుంది. నార్సింగి-రాజేంద్రనగర్ ప్రాంతాల్లో వెయ్యి రూపాయలు పెరగొచ్చు. కాబట్టి హైదరాబాద్‌లో ఇళ్లు కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం. కొన్ని నిర్మాణ సంస్థలు ప్రత్యేక రాయితీలను కూడా కల్పిస్తున్నాయని వాటిని వినియోగించుకోవాలి.
- ఎస్. రాంరెడ్డి, క్రెడాయ్ ఏపీ ప్రెసిడెంట్,
ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్ సీఎండీ.