ఈ దశాబ్దం టీఆర్‌ఎస్‌దే.. | Minister KTR Talking With Media in Telangana Bhavan | Sakshi
Sakshi News home page

ఈ దశాబ్దం టీఆర్‌ఎస్‌దే..

Published Thu, Jan 2 2020 1:11 AM | Last Updated on Thu, Jan 2 2020 8:39 AM

Minister KTR Talking With Media in Telangana Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘కొత్త దశాబ్దం 2020–30 టీఆర్‌ఎస్, తెలంగాణదే. ఇప్పటికే అభివృద్ధి, సంక్షేమ రంగాలకు చిరునామాగా మన రాష్ట్రం. ఇకపై అక్షరాస్యతతో సహా అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండేలా తీర్చిదిద్దుతాం’అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో సింహభాగం స్థానాలు టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని, పార్టీపరంగా 2019లో కొన్ని ఎత్తుపల్లాలు చూసినా అద్భుతంగా రాణిస్తున్నట్లు చెప్పారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌ సీఎం అవుతారని వస్తున్న వార్తలను ప్రస్తావించగా.. తానే సీఎంగా కొనసాగుతానంటూ కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా స్పష్టం చేసినా ఇంకా అనుమానాలు ఎందుకని తిరిగి ప్రశ్నించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తి చేసుకున్నామని, 30 జిల్లాల్లో పార్టీ భవనాలను సంక్రాంతి తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని వెల్లడించారు. పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతుల నిర్వహణపై కసరత్తు చేస్తున్నామని, మున్సిపల్‌ ఎన్నికలపై క్షేత్రస్థాయి నుంచి నివేదికలు అందిన తర్వాత ఈ నెల 5, 6 తేదీల్లో కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని తెలిపారు.

సవాళ్లను ఎదుర్కొంటాం...
పాలనాపరంగా ప్రతికూలత ఎదురైనా అవకాశాలుగా మలుచుకోవడంలో కేసీఆర్‌ది అందెవేసిన చేయి. ‘దిశ’ఘటనలో ప్రభుత్వం వ్యహరించిన తీరు, ఆర్టీసీ కార్మికుల సమ్మె తదితర సమయాల్లో సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో ప్రభుత్వం, పార్టీ రుజువు చేసి చూపింది. ఏపీ సీఎం జగన్‌తోనే కాదు, పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్‌గఢ్‌తోనూ పొరుగు వారిని ప్రేమించాలనే నినాదంతో ముందుకెళ్తాం. పోతిరెడ్డిపాడు కాల్వ వెడల్పుకు సంబంధించి చిన్న చిన్న సమస్యలు వచ్చినా, పరిణతితో అర్థం చేసుకుని ముందుకు వెళ్తాం. కృష్ణా–గోదావరి నదుల అనుసంధానానికి సంబంధించి ఇప్పటివరకు నిర్ణయం జరగలేదు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నిష్క్రమిస్తున్నారనే వార్తలపై మాట్లాడను. కాంగ్రెస్‌ పార్టీ కాడిని కింద పడేసిందనలేం. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న కాంగ్రెస్‌ను ఆషామాషీగా తీసుకోం. బీజేపీ నా బాల్యం నుంచి ఎదుగూబొదుగూ లేకుండా ఉంది. అప్పుడప్పుడూ అదృష్టం కలిసొచ్చి ఒకటీ అరా సీట్లు గెలిచింది’అని పేర్కొన్నారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా, ప్రతికూలంగా రాష్ట్రంలో అనేక ర్యాలీలు జరిగాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. అయితే సున్నితమైన ప్రాంతంలో సభకు కాంగ్రెస్‌ ప్రయత్నించినందుకే అనుమతి నిరాకరించినట్లు తెలిపారు. ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కేసీఆర్‌ను మించిన పెద్ద హిందువు ఎవరున్నారని, ఆయనలా యాగాలు, మందిర నిర్మాణం ఎవరు చేశారని ప్రశ్నించారు.

సదరన్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ పెట్టాలి
‘రక్షణ రంగ పరిశోధన, ఉత్పత్తులకు సంబంధించి హైదరాబాద్, బెంగళూరు కీలకం. రెండు పట్టణాల నడుమ డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ పెట్టాల్సి ఉండగా, బుందేల్‌ఖండ్‌కు తరలించారు. ఢిల్లీ–ముంబై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ తరహాలో సదరన్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ పెడితే దక్షిణాదిన హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పాటు రాయలసీమ ప్రాంతానికి మేలు కలుగుతుంది. దేశాన్ని 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడంలో రాష్ట్రాలను కూడా భాగస్వాములను చేయాలి. మౌలిక సదుపాయాల కోసం కేంద్రం ప్రతిపాదించిన రూ.1.06 లక్షల కోట్లకు సంబంధించి బడ్జెట్‌లో పూర్తి వివరాలు వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఎంత మేర మేలు జరుగుతుందో తెలుస్తుంది. చుట్టూ భూభాగం ఆవరించిన ఉన్న తెలంగాణలో భవిష్యత్తులో ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ ద్వారా భద్రాచలం వరకు నౌకలు వచ్చే అవకాశం ఉంది. మల్లన్నసాగర్, మిడ్‌మానేరు, శ్రీశైలంలో సీ ప్లేన్‌లు దిగే అవకాశం ఉంటుంది. విజయవాడ మార్గంలో నకిరేకల్‌ సమీపంలో డ్రైపోర్టు ప్రతిపాదిత దశలో ఉంది. ఎంఎంటీఎస్‌ రెండో దశ, ఫలక్‌నుమా నుంచి మెట్రో పొడిగిస్తాం. జేబీఎస్‌–సీబీఎస్‌ మెట్రోమార్గాన్ని త్వరలో సీఎం ప్రారంభిస్తారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మా పార్టీలో కార్యకర్తల నడుమ తీవ్ర పోటీ ఉంది. నామినేటెడ్‌ పదవులు, ఇతర అవకాశాలు ఇస్తామని కాళ్లు పట్టుకుని, కడుపులో తలపెట్టి బతిమిలాడుతాం. ఇద్దరు ముగ్గురు బలమైన అభ్యర్థులు ఉన్న చోట అంతర్గత పోటీ నివారిస్తాం. ఎంఐఎం మిత్రపక్షమైనా మున్సిపల్‌ ఎన్నికల్లో కలసి పోటీ చేయబోం’అని కేటీఆర్‌ వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement