![NASA Brings Sunita Williams Butch Wilmore to return Earth Sooner](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/Sunitha_Williams_Latest.jpg.webp?itok=u7nwNItZ)
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ మరింత ముందుగానే భూమ్మీదకు రానున్నారా?. మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌తో ఎనిమిది నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనే చిక్కుకుపోయిన ఆమెను వెనక్కి రప్పించే ప్రక్రియ మరింత వేగవంతం కానుందా?.. అసలు మేటర్ ఏంటంటే..
మార్చి నెలాఖరులో లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో క్రూ-10 మిషన్ నిర్వహించాలని నాసా భావించింది. ఈ మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములను స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ద్వారా ఐఎస్‌ఎస్(ISS)కు పంపాలనుకుంది. అయితే ఈ ప్రయోగంలోనే సునీత, విల్‌మోర్‌లను తిరిగి భూమ్మీదకు రప్పించేందుకు స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ‘ఎండేవర్’ను వినియోగించబోతోంది.
తొలుత మార్చి 25వ తేదీన ఈ ప్రయోగాన్ని షెడ్యూల్ చేయగా ఇప్పుడది ముందుకు జరిగింది. మార్చి 12వ తేదీనే ఈ ప్రయోగం నిర్వహించబోతున్నారని నాసా(NASA) ధృవీకరించింది. ఈ కొత్త టీం అక్కడికి చేరుకోగానే.. -క్రూ-9లో వెళ్లిన సునీతా విలియమ్స్(Sunita Williams), విల్‌మోర్‌లు రిలీవ్ అవుతారు. అలా డ్రాగన్ క్యాప్సూల్ ఎండేవర్ ద్వారా ఇద్దరు భూమ్మీదకు రావడానికి మార్గం సుగమం అవడమే కాకుండా ఐఎస్‌ఎస్ నిర్వహణ కూడా నిలిచిపోకుండా ఉండగలుగుతుందన్నమాట. అన్ని అనుకున్నట్లు జరిగితే.. మార్చి 19వ తేదీన సునీత, విల్‌మోర్‌లు భూమ్మీద అడుగుపెట్టే అవకాశాలున్నాయి .
ఇక క్రూ-10లో వెళ్లే నలుగురు వోమగాములు 150 రోజుల తర్వాత అంటే ఈ జులైలో స్పేస్ ఎక్స్‌కే చెందిన ఎండూరెన్స్ క్యాప్సూల్ ద్వారా భూమ్మీదకు చేరుకుంటారు.
కిందటి ఏడాది జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా క్రూ-9 మిషన్‌లో భాగంగా సునీత సహా నలుగురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. అయితే.. స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇద్దరు వోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్‌లు మాత్రమే తిరిగి భూమ్మీదకు వచ్చారు. దీంతో అప్పటి నుంచి సునీత, విల్‌మోర్‌లు స్పేస్ స్టేషన్‌లోనే ఉండిపోయారు.
ఇదీ చదవండి: యాక్సియోమ్ మిషన్-4లో భారతీయుడు
Comments
Please login to add a commentAdd a comment