
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో ఎంపీ కేకే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌కు కేసీఆర్ రూపంలో అద్భుత నాయకత్వం, 60 లక్షల సభ్యత్వంతో పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నియోజకవర్గ స్థాయిలో నాయకులు కష్టపడి పనిచేయాలని సూచించారు. కేసీఆర్ బాటలో పార్టీ యంత్రాంగం నడుస్తోందని చెప్పారు. ఈ నెల 25న జరిగే ప్లీనరీ, వచ్చే నెల 15న వరంగల్‌లో జరిగే ‘తెలంగాణ విజయగర్జన’ బహిరంగ సభ సన్నాహాలపై పార్టీ నేతలకు ఆయన దిశా నిర్దేశం చేశారు.
రాష్ట్రంలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనేతలతో పార్టీ కార్యాలయం తెలంగాణభవన్‌లో సోమవారం బృందాల వారీగా సమావేశమయ్యారు. రెండేసి నియోజకవర్గాలకు చెందిన నేతలతో సుమారు అర గంట పాటు ఉదయం 10 గంటల నుంచి వరుస భేటీలు నిర్వహించారు. సిరిసిల్ల, కోరుట్ల, దుబ్బాక, సంగారెడ్డి, వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల, సూర్యాపేట, హుజూర్‌నగర్, దేవరకొండ, తుంగతుర్తి, వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, అలంపూర్, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో పాటు సంబంధిత ఎంపీలు పాల్గొన్నారు.
పార్టీ సంస్థాగత నిర్మాణం కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని, త్వరలో వ్యవస్థాగత నిర్మాణ కార్యాచరణ కూడా ప్రకటిస్తామన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభం ఉం టుందని, నవంబర్ 15న జరిగే వరంగల్ విజయగర్జన సభ తర్వాత పార్టీశ్రేణులు, ప్రజాప్రతినిధులకు శిక్షణకార్యక్రమాలు ఉంటాయన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే ప్రజలు ప్రతి ఎన్నికలోనూ టీఆర్‌ఎస్‌కు అండ గా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఘనంగా టీఆర్‌ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాలు
పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఈ ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొనేలా చూడాలని పార్టీ నేతలను కేటీఆర్ ఆదేశించారు. ఈ నెల 25న జరిగే పార్టీ ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు ఆహ్వానాలు పంపుతున్నామని, నవంబర్ 15న వరంగల్‌లో జరిగే విజయగర్జన సభను విజయవంతం చేసేందుకు కార్యాచరణ చేపట్టాలన్నారు. ఈ నెల 27న నియోజకవర్గ స్థాయిలో జరిగే సన్నాహక సమావేశాల ప్రారంభానికి ముందే స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి కార్యకర్తలతో బహిరంగ సభ కార్యాచరణపై సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.
బహిరంగ సభకు ప్రతి గ్రామ కమిటీ సభ్యులు కచ్చితంగా హాజరయ్యేలా కార్యచరణ ఉండాలని కేటీఆర్ సూచించారు. దుబ్బాక, సంగారెడ్డి నియోజకవర్గాల కార్యకర్తలు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సారథ్యంలో కేటీఆర్ భేటీకి హాజరయ్యారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి అనారోగ్యం కారణంగా భేటీకి దూరంగా ఉన్నారు. సోమవారం కేటీఆర్ నిర్వహించిన వరుస భేటీల్లో పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్, సబితాఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చేరిక కార్యక్రమానికి ఆయన అనుచరులు తరలిరావడంతో పార్టీ కార్యాలయ పరిసరాలు సందడిగా మారాయి.