మామీద పడి తినొద్దు.. మీ దేశానికి పొండి! | i am paying your bills, says white customer in racial attack | Sakshi
Sakshi News home page

మామీద పడి తినొద్దు.. మీ దేశానికి పొండి!

Published Mon, Feb 27 2017 11:31 AM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM

మామీద పడి తినొద్దు.. మీ దేశానికి పొండి!

మామీద పడి తినొద్దు.. మీ దేశానికి పొండి!

జాతి విద్వేష వ్యాఖ్యలతో కొందరు అమెరికన్ పౌరులు విదేశీయులను తీవ్రంగా అవమానిస్తున్నారు. దీనికి సంబంధించిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా డల్లస్ కౌంటీ పరిధిలోని ఇర్వింగ్ నగరంలో గల వాల్‌మార్ట్ దుకాణంలో జరిగిన ఓ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తోంది. తాము కష్టపడి పనిచేసి పన్నులు కడుతుంటే విదేశీయులు తమ మీద పడి బతికేస్తున్నారని, ''మీ సొంత దేశానికి వెళ్లిపోండి'' అని అతగాడు అన్నాడు. వాల్‌మార్ట్ దుకాణంలో పనిచేసే ఆదెలా అనే మహిళ ఎల్ సాల్వెడార్ నుంచి 20 ఏళ్ల క్రితమే వచ్చారు, ఆమెకు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. వాల్‌మార్ట్ దుకాణానికి వచ్చిన శ్వేత జాతీయుడు ఆమెతో దురుసుగా మాట్లాడటమే కాక, తనకు సాయం చేయడానికి తెల్లజాతివారే కావాలని అడిగాడు. 
 
విషయం ఏమిటంటే.. వాల్ మార్ట్ స్టోర్‌కు వచ్చిన ఆ శ్వేతజాతి కస్టమర్, తన కళ్లద్దాలతో ప్యాకెట్ల మీద ఉన్నవి సరిగా కనిపించడం లేదని చెప్పాడు. దాంతో ఆదెలా ఆయనకు ఒక వైద్యుడిని కలవాల్సిందిగా సూచించారు. అయితే ఆమె సాయం తీసుకోవడానికి నిరాకరించిన అతడు.. తనకు తెల్లవాళ్లే కావాలని చెప్పాడు. దాంతో ఆదెలా మీరు జాతి విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని అతడికి చెప్పడమే కాక, సూపర్‌వైజర్‌కు కూడా తెలియజేసినా, ఆయన కాన్ఫరెన్స్ కాల్‌లో బిజీగా ఉండటంతో పట్టించుకోలేదు. అంతలో అక్కడే ఎలక్ట్రిక్ వీల్‌చెయిర్‌లో ఉన్న ఓ నల్లజాతి మహిళ గురించి కూడా ఆ శ్వేతజాతీయుడు దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ''ఆమెను చూడండి, ఆమె ఆస్పత్రి బిల్లులు ఎవరు చెల్లిస్తున్నారు, నేనే.. అవును, నేను ఆమె బిల్లులు చెల్లిస్తున్నాను. ఆమె విదేశీయురాలు. ఇక్కడికి వచ్చింది. అనారోగ్యం పాలై బాగా లావెక్కింది. అందువల్ల ఆమె ఏమీ చేయలేదు, పని కూడా చేయలేదు. కానీ నేను ఆమె బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. నేనేమైనా లావుగా ఉన్నానా? నేను రోజూ పనికి వెళ్లి, పన్నులు చెల్లిస్తున్నాను. ఆ పన్నులతోనే ఆమెకు చికిత్స జరుగుతోంది'' అన్నాడు. 
 
అయితే, తాను కూడా ఉద్యోగం చేసి, పన్నులు చెల్లిస్తున్నానని ఆదెలా అతడికి సమాధానం ఇచ్చారు. కానీ అతడు అక్కడితో ఆగలేదు. ''తెల్లవాళ్లు కష్టపడి పనిచేస్తుంటే విదేశీయులంతా మామీద పడి బతికేస్తున్నారు. అవును. నేను నీకు నిజం చెబుతున్నాను. మీరు ఇక్కడి నుంచి వెళ్లడానికి రాలేదు, ఇక్కడే ఉండిపోతారని నాకు తెలుసు. కానీ మీరు మీ సొంత దేశాలకు వెళ్లిపోయి అక్కడ మీ దేశాలను బాగు చేసుకోండి'' అని వ్యాఖ్యానించాడు. 
 
ఆ తర్వాత సూపర్‌వైజర్ రావడంతో అతడు అక్కడినుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సూపర్‌వైజర్‌కు ఆదెలా అతడి సంభాషణ మొత్తాన్ని రికార్డు చేసిన వీడియో చూపించారు. తనకు ఏం చేయాలో తెలియలేదని, ఏడవాలో వద్దో కూడా అర్థం కాలేదని అన్నారు. ఆ శ్వేతజాతీయుడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలని వాల్‌మార్ట్‌లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులకు సూపర్‌వైజర్ చెప్పారు గానీ, అతడు అప్పటికే వెళ్లిపోయాడు. ఇలాంట జాతివివక్షను తాను ఇంతవరకు ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆదెలా వాపోయారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement