
నేను సమైక్యాంధ్ర ముఖ్యమంత్రినే.. దిగ్విజయ్ పై సీఎం ఆగ్రహం!
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం శిలాశాసనం అయితే సమైక్యాంధ్ర కోసం మాజీ ప్రధానుల జవహర్ లాల్ నెహ్రు, ఇందిరాగాంధీలు తీసుకున్న నిర్ణయాలు తప్పా అని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. సమ్మె ప్రారంభమై 60 రోజులు దాటినా.. కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రాంత ప్రజలకు, ఉద్యోగులకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు అని అన్నారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని పున:పరిశీలించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఇరు ప్రాంతాల మధ్య సంబంధాలు బలపడేందుకు నెహ్రూ, ఇందిరాలు కృషి చేశారన్నారు.
రాష్ట్ర విభజన జరిగితే అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయని.. సమస్యలకు అంత త్వరగా పరిష్కారం కావని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. సమైక్యాంధ్ర సీఎంగా వ్యవహరిస్తున్నారని దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు గుర్దొచ్చిన ప్రతిసారి సమైక్యాంధ్ర కోసం పోరాడాలని అనిపిస్తోందన్నారు. తాను రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాను పోరాటం చేస్తున్నానని అన్నారు. తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టింది సోనియా ఆశీస్లుల వల్లేనని.. కాంగ్రెస్ పార్టీ తోనే తనకు మనగడ అని.. పార్టీ లేకపోతే తనకు మనగడ లేదని ఆయన అన్నారు. నా పదవికంటే తెలుగు ప్రజల మేలే తనకు ముఖ్యం అని అన్నారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా తాను పదవి కోసం పాకులాడటం లేదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ప్రాంతంలోని విద్యార్థులు నష్టానికి గురవుతారని అన్నారు. ఉద్యోగులు, టీచర్లు, కార్మికులు సమ్మెను విరమించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆరున్నర లక్షల మంది సమ్మెలో ఉన్నారు. విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు అని అన్నారు. సీమాంధ్రలో ఉద్యమాల వల్ల ప్రభుత్వ కార్యాలయాలు, స్యూల్స్ మూతపడ్డాయన్నారు. సమ్మె నిర్ణయాన్ని పున:పరిశీలించాలని, విభజన జరిగితే ఎలాంటి నష్టం కలుగుతుందనే విషయాన్ని ఉద్యోగులు తెలియచేయాల్సిన అవసరం ఉంది అన్నారు. విభజన జరిగితే సాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
సమ్మె వల్ల జీతాలపైనే ఆధారపడి ఉన్న ఉద్యోగులకు ఇబ్బంది కలుగుతుందిజ 1300 కోట్ల రూపాయల చెల్లింపుల్లో 300 కోట్ల రూపాయలే చెల్లించారన్నారు. 1955లో నాగార్జున సాగర్ కు జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారని.. ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రారంభించారన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల 70 వేల ఎకరాలు గుంటూరు, నల్గొండ జిల్లాలో మునకకు గురయ్యాయి. అప్పుడే విడిపోతే అన్ని గ్రామాలు ముంపు గురయ్యేవి కాదని అన్నారు.