సీఎం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్!
పుదుచ్చేరి: పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వం, లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మధ్య మళ్లీ ఘర్షణ తారాస్థాయికి చేరింది. లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మంగళవారం కేంద్రం నామినేట్ చేసిన ముగ్గురు వ్యక్తులతో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయించారు. బీజేపీ పుదుచ్చేరి శాఖ అధ్యక్షుడు వీ స్వామినాథన్, పార్టీ కోశాధికారి కేజీ శంకర్, విద్యావేత్త ఎస్ సెల్వ గణపతిలతో ఆమె హడావిడిగా ప్రమాణస్వీకారం చేయించారు. దీనిపై నారాయణస్వామి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. తమ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తున్నది. మరోవైపు ఈ నియామకాలపై స్టే విధించాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ప్రభుత్వాన్ని సంప్రదించకుండా గవర్నర్ ఎలా ఎమ్మెల్యేలను నామినేట్ చేస్తారని, ఇది సమాఖ్యస్ఫూర్తికి వ్యతిరేకమని సీఎం వీ నారాయణస్వామి అంటుండగా.. ఆయన ఆరోపణలను కిరణ్ బేడీ తోసిపుచ్చారు. తాను రాజ్యాంగం ప్రకారమే నడుచుకున్నట్టు ఆమె తెలిపారు. ‘కేబినెట్ మంత్రులు నా దగ్గరకు వచ్చి.. మీరు ఎందుకు ప్రజలను కలుస్తున్నారు? వారి సమస్యలను ఎందుకు పరిష్కరిస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. మీరు రబ్బర్‌స్టాంప్‌లా ఉండాలని మంత్రులు అంటున్నారు’ అని కిరణ్ బేడీ అన్నారు.