పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రెండు నెలలుగా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. 30 స్థానాలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఒకే విడతలో ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణ స్వామికి షాకిచ్చింది.
ఆయనకు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించలేదు. ఈ విషయాన్ని పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తాజాగా 14 అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. అయితే ఆ జాబితాలో నారాయణస్వామి పేరు లేదు. రెండో జాబితాలోనూ ఆయనకు అవకాశం ఉండదని తెలుస్తోంది. నారాయణస్వామి నియోజకవర్గం నెల్లిథోప్ స్థానాన్ని డీఎంకేకు కేటాయించారు. షా జహన్ కామ్‌రాజ్ నగర్, వి.సుబ్రమణ్యన్ కరైకల్ (నార్త్), కందసామి ఎంబలమ్, కమలకణ్నన్ థిరునల్లర్ స్థానాల్లో పోటీ చేయనున్నారు. ఎన్నికల వ్యవహారాలు, ప్రచారం బాధ్యతలను నారాయణస్వామి చూసుకుంటారని.. అందుకే ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పార్టీ పుదుచ్చేరి వ్యవహారాల ఇన్‌చార్జి గుండురావు తెలిపారు. అయితే నారాయణస్వామి పేరు ప్రకటించకపోవడం కొంత పార్టీలో విబేధాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment